హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్, మహాప్రస్థానంలో ఆదివారం జరిగాయి. అదీ కూడా ఓ అనాథకు నిర్వహించినట్టుగా పూర్తి చేశారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు రూ.1500 కూలి ఇచ్చి చితికి నిప్పుపెట్టించినట్టు సమాచారం.
అయితే, తమ్ముడు దుర్మరణం వార్త తెలుసుకున్న అన్న రవితేజ, ఆయన తల్లి రాజ్యలక్ష్మిలు కనీసం కడసారి చూసేందుకు సైతం వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కరుడుగట్టిన తీవ్రవాదులు చనిపోయినపుడు సైతం వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు చివరిచూపుకు నోచుకుంటారు. కానీ, భరత్ మాత్రం అందరూ ఉండి కూడా అనాథలా కనిపించకుండా పోయాడు.
ఈ నేపథ్యంలో రవితేజ తమ్ముడు చనిపోయిన మరుసటి రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా ది గ్రేట్' షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోలో జరుగుతోంది. తమ్ముడి మరణంతో బాధలో ఉన్న రవితేజ షూటింగ్‌కు వస్తారో లేదో అని డైరెక్టర్ అనిల్ రావిపూడి షూటింగ్‌ను వాయిదా వేయాలనుకుని భావించారు.
కానీ, హీరోనే స్వయంగా దర్శకుడికి ఫోన్ చేసి... ‘నేను షూటింగ్‌కు వస్తున్నాను’ అని చెప్పారట. దీంతో దర్శకుడు షూటింగ్‌కు చకచకా ఏర్పాట్లు చేశారు. కాగా, ‘మనం’ సినిమా కోసం నిర్మించిన ఇంటి సెట్‌లో రవితేజ, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.