నిన్నా మొన్నటి దాకా అమెకి ఒక్క సినిమా చాన్స్ కూడా లేదు. సుడి ఉన్నంత కాలం హీరోయిన్‌గా ఒక్క వెలుగు వెలిగిన ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోవడంతో చేసేదేమీ లేక సినిమా నిర్మాణంలోకి దిగింది. కానీ డ్రగ్స్ కేసు పుణ్యమా అని సోషల్ మీడియా వేదికగా బీభత్సమైన ఫాలోయింగ్‌ని సంపాదించేసుకోవడంతో పది సినిమాల పెట్టు ప్రచారం వచ్చేసిందని ఆమె ఇప్పుడు మైమర్చిపోతోంది. అంత ఫాలోయింగ్ రావడానికి కారణం మగాళ్లకు సాధ్యం కాని పని చేయడమే. డ్రగ్స్ కేసులో తనను విచారించే తీరును ప్రశ్నిస్తూ ఆమె హైకోర్టు తలుపులు తట్టడమే.. ఆ గుండె ధైర్యానికి, ఆ తెగువకు మన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇన్నిరోజులుగా ఆమెను వ్యతిరేకించినవారు సైతం ఇప్పుడామెను సపోర్టు చేయడం విశేషం. పైగా, ఏం భయపడకు.. నీకేం కాదు, కేసులోంచి బయటపడతావు అంటూ సపోర్టు చేయడం కూడా చేస్తున్నారు. కోర్టు గుమ్మం తలుపులు తట్టినందుకే ఈ భాగ్యం దక్కిందని ఆమె ఇప్పుడు మురిసిపోతోంది.
సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఛార్మి అక్కౌంట్ హైపర్ యాక్టివ్‌గా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు.! డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛార్మి, కోర్టును ఆశ్రయించడంతోనే 'పవర్' సంపాదించేసినట్టుంది. నిజానికి, కోర్టులో ఛార్మికి పెద్దగా ఊరట దక్కలేదు. కానీ, ఛార్మికి సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. 'లేడీ వర్మ' అంటూ కొందరు ఛార్మిని పొగిడేస్తున్నారు. ఊహించని స్థాయిలో తనకు వస్తోన్న మద్దతు చూసి ఛార్మి మురిసిపోతోంది. 'విచారణకు హాజరై, క్లీన్ చిట్ పొంది వస్తావ్..' అంటూ అభిమానులు ఆమెను ఆశీర్వదిస్తున్నారు. 'నలుగురు మగాళ్ళు చెయ్యలేని పనిని నువ్వు చేశావ్..' అంటూ ఛార్మి కోర్టుకెళ్ళిన వైనంపై ఇంకొందరు ఆమెను అభినందించేస్తున్నారు. తనను అలా సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేస్తోంటే, ఛార్మి తనను తాను మైమర్చిపోతోంది. అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తోంది.
మరికాస్సేపట్లో బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 'సిట్' యెదుట విచారణకు హాజరు కానుంది ఛార్మి. ఆమె కోసం స్పెషల్‌గా మహిళా టీమ్‌తో 'సిట్' విచారణకు సిద్ధమయ్యింది. బలవంతంగా రక్త నమూనాలుగానీ, తలవెంట్రుకల నమూనాలుగానీ తీసుకునే అవకాశం లేదని ఇప్పటికే ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ క్లారిటీ ఇచ్చేసిన దరిమిలా, ఛార్మి భయపడాల్సిన పనే లేదు. అయితే, కోర్టుకి వెళ్ళడం ద్వారా ఛార్మి, తానే నిందితురాలినని చెప్పుకుందన్న వాదన బలంగా విన్పిస్తోందిప్పుడు. మీడియాలో ఇదే విషయమై చర్చ జరుగుతోంది.
ఏదిఏమైనా, సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు పెద్దగా అవకాశాల్లేక సినీ నిర్మాణంలో భాగస్వామిగా మారిన ఛార్మి, ఇప్పుడిలా ఈ కేసు పుణ్యమా అని సోషల్ మీడియా వేదికగా బీభత్సమైన ఫాలోయింగ్‌ని సంపాదించేసుకోవడం ఆశ్చర్యకరమే.