ఇకపై సినిమా-సీరియల్స్ షూటింగ్​ చేయాలంటే ఇవి పాటించాల్సిందే

మంగళవారం, 2 జూన్ 2020 (21:16 IST)
త్వరలో పునఃప్రారంభమయ్యే సినిమా, టీవీ షూటింగ్స్​కు సంబంధించి 16 పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. షూటింగ్​ సమయాల్లో ఈ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది వాటి గురించి తెలుసుకుందాం.
 
 లాక్​డౌన్​తో నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగ్స్​ ఇతర కార్యకలాపాలు త్వరలో పునఃప్రారంభమయ్యే నేపథ్యంలో వాటికి సంబంధించి 16 పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం.
 
షూటింగ్​ స్పాట్​లో ఈ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజరు, గ్లౌజులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అందులోని ముఖ్యమైన మార్గదర్శకాలపై ఓ లుక్కేద్దాం.
 
- చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్‌ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. యూనిట్‌ సభ్యులు ప్రతి ఒక్కరూ మాస్క్‌, గ్లోవ్స్‌ షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నంత సేపూ విధిగా ధరించాలి.
 
- సెట్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్న వ్యక్తుల్ని సెట్‌లోకి రానివ్వకూడదు.
 
- ఇండోర్​ లొకేషన్స్​లో గాలి ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిస్పోసబుల్ గ్లాసులు, ప్లేట్లు, కప్స్​ ఉపయోగించాలి. ముఖ్యంగా ప్రింటర్​ స్టేషన్స్​లోని కరెంట్​తో సహా ఇతరత్రా మీటాలను కూడా శానిటైజింగ్​ చేయాలి.
 
- సెట్​లోని ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో 'ఆరోగ్య సేతు' యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోవాలి. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. వైద్య సిబ్బంది, సెట్స్​ బయట అన్ని వేళలా ఆంబులెన్స్​ అందుబాటలో ఉండటం తప్పనిసరి.
 
- ప్రతిరోజూ షూటింగ్‌ ప్రారంభించే ముందు స్టూడియో మొత్తాన్ని శానిటైజ్‌ చేయాలి.
 
- గర్భవతి, 65 ఏళ్లు పైబడిన వారు షూటింగ్​ స్పాట్​లో లేకుండా చూసుకుంటే మంచిది. ఒకవేళ ఉంటే వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. షూటింగ్​ సమయాల్లో అభిమానులను మాత్రం అస్సలు అనుమతించకూడదు.
 
- ఆడిషన్స్​ వీలైనంత వరకు ఫేస్​ టైమ్​, జూమ్​, స్కైప్​ వంటి సామాజిక మాధ్యమాల యాప్​ ద్వారా జరిగేలా చూసుకోవాలి.
 
- నటీనటులను తమ కాస్ట్యూమ్​ వారే తెచ్చుకునే విధంగా ప్రోత్సహించాలి.
 
- 24 గంటలపాటు షూటింగ్​ స్పాట్​, స్టూడియోల్లో సెక్యూరిటీ గార్డ్స్​ విధుల్లో ఉండేలా చూసుకోవాలి. తద్వారా అతడు మాత్రమే గ్లౌజులు ధరించి తలుపులను తెరవడం, మూసివేయడం చేయడం ద్వారా ఎవరు తలపుల హ్యాండిల్స్​ను తాకకుండా ఉండే అవకాశం ఉంటుంది.
 
- మధ్యాహ్న భోజన సమయంలోనూ భౌతిక దూరం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి, మార్కెట్లు, ఫైట్​ వంటి భారీ సన్నివేశాలను కరోనా తగ్గేవరకు చిత్రీకరించకుండా ఉండటం మంచిది.
 
- మేకప్‌ సిబ్బంది, హెయిర్‌ డ్రెస్సర్స్‌ పీపీఈ సెట్స్‌ ధరించాలి. ప్రతి ఒక్కరికీ మేకప్‌ చేసే ముందు, చేసిన తర్వాత శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి. మేకప్‌ చేసే సమయంలో మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు.
 
- 10ఏళ్ల లోపు పిల్లలను సెట్​లోకి అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే ఆ పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఒక్కరిని మాత్రమే నియమించాలి.
 
- నాన్​ ఫిక్షన్​ షోల్లో భౌతిక దూరం ఉండేలా సీట్లను కేటాయించాలి.
 
- షూటింగ్​లో ఉన్న నటీనటులకు, మిగతా సిబ్బందికి వసతి కల్పించడం, ముఖ్యంగా వారి ప్రయాణాల కోసం ప్రత్యేక వాహనాలను కేటాయించడం వంటివి చేయాలి. వారు ప్రజారవాణాను ఉపయోగించకుండా చూసుకోవాలి.
 
- సెట్స్​ లేదా స్టూడియోల్లో ప్రొడక్షన్​ బృందాలకు ప్రత్యేక విభాగాలను కేటాయించాలి. తద్వారా పనిచేసే సబ్బంది గుమిగూడకుండా ఉండటానికి దోహదపడతుంది.
 
- సెట్స్​లో ఉన్నవారు ఒకరి ఫోన్​లను ఒకరు తాకకూడదు. ముఖ్యంగా భోజనాలను ప్రత్యేకంగా ఇంటి వద్ద నుంచే తెచ్చుకునేలా వారిని ప్రోత్సాహించాలి.
 
- సెట్స్​లో ఉన్నవారు.. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు లేదా ఇంకెవరికైనా కరోనా లక్షణాలు కనబడితే వారు స్వచ్ఛందంగా క్వారంటైన్​లోకి వెళ్లిపోవాలి.
 
- టీవీ కార్యక్రమాలు లేదా సినిమాల షూటింగ్​ కోసం ఆ సదరు నిర్మాత అక్కడి స్థానిక కలెక్టర్​ దగ్గర నుంచి అనుమతి పత్రం పొందాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు