డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయి... ప్రతి ఒక్క మీడియాలో బాగా పాపులర్ అయిన మన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. జనవరి ఒకటో తేదీ నుండి ప్రదీప్ కనిపించకపోవడంతో మీడియాలో అతనిపై అనేక రకాలైన పుకార్లు షికారు చేసాయి. దీనితో ప్రదీప్ స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి, తాను ఎక్కడికీ వెళ్లలేదని షూటింగ్‌ల కారణంగా బిజీగా ఉన్నానని, తప్పకుండా కౌన్సెలింగ్‌కు హాజరవుతానని పేర్కొన్నాడు.
సోమవారంనాడు గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు తన తండ్రితో కలిసి హాజరైన ప్రదీప్ మొదటి వరుసలో కూర్చున్నాడు. ఇందులో భాగంగా ప్రదీప్‌కు మూడు డాక్యుమెంటరీలు చూపించారు. వీటిని చూపిస్తూనే మద్యం తాగడం వల్ల మనిషి ఎలాంటి అనారోగ్యాలకు లోనవుతాడనేది కూడా చెప్పారు. కౌన్సిలింగ్ ముగిశాక మీడియా ముందుకు వచ్చిన ప్రదీప్, తను చేసిన తప్పును ఎవ్వరూ చేయవద్దని మరోసారి సూచించాడు.