''నేను 'అన్వేషణ' సినిమా తీయడానికి హిచ్‌కాక్ కూడా ఓ ప్రేరణ. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు వీసీఆర్ కొన్నప్పుడు అందులో 'సైకో' చూశా. హిచ్‌కాక్ తీసిన మొత్తం 53 సినిమాలు చూసిన వ్యక్తిని నేను. ఆ విషయం పులగం చిన్నారాయణకు తెలుసు. నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్ గుర్తులు ఉన్నాయి. సినిమాకు అవసరమైనవి మూడు... స్క్రిప్ట్, స్క్రిప్ట్, స్క్రిప్ట్ అని చెప్పాడు హిచ్‌కాక్. ఆయన మీద పులగం చిన్నారాయణ, రవి పాడి గొప్ప పుస్తకం తీసుకొచ్చారు. ఇదొక అద్భుతం. రచయితలు ఇద్దరూ నాకు సన్నిహితులు.
Vamsi, pulagam, Harish shankar, nazar
ఈ పుస్తకం తొలి ప్రతిని చూసి థ్రిల్ అయ్యా'' అని సుప్రసిద్ధ దర్శకులు వంశీ చెప్పారు. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. ఇందులో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రసిద్ధ దర్శకులు వంశీ ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకులు హరీష్ శంకర్‌కు, రెండో ప్రతిని సీనియర్ నటులు నాజర్‌కు అందజేశారు. తొలి ప్రతిని 'సంతోషం' మ్యాగజైన్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ఐదు వేల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. ఈ బుక్ కవర్ పేజీని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ఈశ్వర్ గారు డిజైన్ చేశారు. ఈ బుక్ కవర్ పేజీ ఫ్రేమ్‌ని దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి ఆవిష్కరించారు. పుస్తకాన్ని పబ్లిష్ చేసిన అక్షౌహిణి మీడియా లోగోని దర్శకులు హరీష్ శంకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకులు వంశీ మాట్లాడుతూ... ''నేను హిచ్‌కాక్‌ను విపరీతంగా ప్రేమిస్తాను. ఆయన మీద ఇటువంటి పుస్తకం వేయాలని ఆలోచన రావడం ఒక అద్భుతం. నాకు తెలిసి భారతీయ భాషల్లో ఎవరూ ఇటువంటి ప్రయత్నం చేయలేదు. పుస్తకం కూడా అద్భుతంగా వచ్చింది. ఈ విధంగా ఎవరూ చేయలేరు. ఇది మళ్ళీ రీ ప్రింట్ కి రావాలి'' అని చెప్పారు.
దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ. సినిమాకు సంబందించిన పుస్తకాలు చాలా తక్కువ అయ్యాయి. మొబైళ్లను వదిలేసి మళ్ళీ పుస్తకం పెట్టుకోవాలనే రీతిలో సినిమా ఇండస్ట్రీపై, ప్రముఖులపై పుస్తకాలు తీసుకు వస్తూ పులగం చిన్నారాయణ గారు చేస్తున్న కృషికి, ప్రయత్నానికి నా సాష్టాంగ ప్రణామాలు. సినిమా సక్సెస్ మీట్ ఎలా పెడతామో... అలాగ ఈ బుక్ సక్సెస్ మీట్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఇన్ని కాపీలు అమ్ముడు అయ్యాయని అతి త్వరలో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అందరి దృష్టికి బుక్ చేరేలా కృషి చేస్తా. బుక్స్ ఎంత మంది చదువుతారని కొందరికి సందేహం ఉండొచ్చు. వంశీ గారు రాసిన పసలపూడి కథలు పుస్తకం మీద ఒక వ్యక్తి పీహెచ్‌డి చేసి ఒక బుక్ రాశారు. ఆ బుక్ రీ ప్రింట్ చేశారంటే పుస్తకాలు చదివేవారు ఎంత మంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా దాసోహం అనే సినిమాలు హాలీవుడ్ తీయడానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న నవలలు, బుక్ బ్యాంకు. హ్యారీ పోటర్ కానివ్వండి, మరొకటి కానివ్వండి... బుక్ బేస్డ్ తీశామని చెబుతారు. అక్కడ సాహిత్యానికి పెద్దపీట వేశారు కాబట్టే సినిమాకు అంత ఆదరణ వచ్చింది. న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ అని అంటుంటారు కదా. అలా హైదరాబాద్ బెస్ట్ సెల్లర్ అని 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' అని వేయాలని కోరుకుంటున్నాను. నేను వేదికపైకి వస్తున్నప్పుడు 'ఈయన మన మన్మోహన్ దేశాయ్' అన్నారు రవి పాడి గారు. ఒక్కసారి నా గుండె జల్లుమంది. మన్మోహన్ దేశాయ్ నా ఫేవరేట్ డైరెక్టర్'' అని చెప్పారు.
దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ... ''మూకీ నుంచి మాటల సినిమా వరకు తనదైన ముద్ర వేసిన అతికొద్ది మంది దర్శకుల్లో హిచ్‌కాక్ ఒకరు. విజువల్‌తో చెప్పలేనప్పుడు డైలాగ్ ఉపయోగించాలని ఆయన చెప్పారు. ఆయన వర్టిగో, సైకో, బ్లాక్ మెయిల్ సినిమాలు అద్భుతం. సౌండ్ ఎలా వాడాలో కూడా చెప్పిన దర్శకుడు ఆయన. బర్డ్స్ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ లేదు. తనకు తాను కొత్త సవాళ్లు ఏర్పరుచుకుని అధిగమించే దర్శకుడు హిచ్‌కాక్. ఆయనకు ఒక్క ఆస్కార్ కూడా రాలేదు. అది గమ్మత్తైన విషయం. అటువంటి గొప్ప దర్శకుడి మీద టెక్స్ట్ బుక్ లాంటి పుస్తకం తీసుకు రావడం గొప్ప విషయం. పులగం గారు, రవి గారు అద్భుతమైన ప్రయోగం చేశారు. ఇటువంటి పుస్తకాలు ఆదరాబాదరాగా వేస్తారు. కానీ చిన్నారాయణ క్వాలిటీతో తీసుకొచ్చారు. ఆల్రెడీ మా ఇంట్లో ఈ బుక్ కావాలని అడిగారు... నేను ఇంకో రెండు మూడు కాపీలు కొంటాను'' అని చెప్పారు.
సీనియర్ నటులు నాజర్ మాట్లాడుతూ... ''సినిమా గురించి మన దగ్గర పెద్దగా పుస్తకాలు లేవు. నేను ఫిలిం స్కూల్ లో చదివినప్పుడు ఒక బుక్ ఉండేది. అది మాకు బైబిల్. హిచ్‌కాక్‌ను ఫ్రెంచ్ క్రిటిక్ ట్రూఫో ఇంటర్వ్యూ చేశారు. అది బెస్ట్ బుక్. అనుకోకుండా నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. హిచ్‌కాక్ మీద పులగం చిన్నారాయణ, రవి పాడి గారు బుక్ తీసుకు రావడం ఇంకా సంతోషంగా ఉంది'' అని అన్నారు.
దర్శకులు మెహర్ రమేష్ మాట్లాడుతూ... ''నాకు పూరి జగన్నాథ్ ద్వారా పులగం చిన్నారాయణ పరిచయం. 'బద్రి' నుంచి వెన్నంటే ఉండేవారు. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పేవారు. ఈ బుక్ గురించి అందరికీ తెలిసేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను'' అని అన్నారు.
దర్శకులు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ... ''వంశీ గారు మాట్లాడారని నేను హరీష్ శంకర్ తో బెట్ కట్టాను. హరీష్ ఏమో, ఆయన మాట్లాడతారని అన్నాడు. అతను గెలిచాడు. నేను ఓడిపోయాను. హిచ్‌కాక్ మీద ఆయనకు ఎంత మమకారం ఉందనేది ఆయన మాటల్లో కనిపించింది. నాతో ఈ బుక్ కోసం ఆర్టికల్ రాయించారు పులగం చిన్నారాయణ. ఆయనకు, రవి పాడి గారికి కంగ్రాట్స్'' అని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు రచయితలు ఇద్దరినీ అభినందించారు.
'జంధ్యా మారుతం', 'ఆనాటి ఆనవాళ్లు', 'సినీ పూర్ణోదయం', 'స్వర్ణయుగ సంగీత దర్శకులు', 'పసిడితెర', 'సినిమా వెనుక స్టోరీలు', 'మయా బజార్ మధుర స్మృతులు', 'వెండి చందమామలు', 'జై విఠలాచార్య', 'పడమటి సినిమా పరిమళం' - పులగం చిన్నారాయణ మొత్తం పది పుస్తకాలు రాశారు. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' ఆయన రాసిన పదకొండో పుస్తకం. ఉత్తమ సినీ గ్రంథకర్తగా రెండు నంది అవార్డులు, ఉత్తమ సినీ విమర్శకుడిగా ఓ నంది అవార్డు అందుకున్నారు పులగం చిన్నారాయణ.