'నంది' జ్యూరీ సభ్యుల ఎంపికలోనే తప్పు జరిగింది : అశ్వినీదత్

ఆదివారం, 19 నవంబరు 2017 (15:19 IST)
నంది అవార్డులను ప్రకటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొంత తప్పు చేసిందనీ ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. అసలు మూడు సంవత్సరాలకు ఒకేసారి అవార్డులు ప్రకటించడమే పెద్ద తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈనెల 14వ తేదీన ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన ఫిల్మ్ నగర్‌లో పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, మూడు సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులను ఒకేసారి ప్రకటించడంతోనే వివాదం ఏర్పడిందన్నారు. అసలు అవార్డులే ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించడం లేదని గుర్తుచేశారు. జ్యూరీ సభ్యుల ఎంపికలో ప్రభుత్వం చిన్న తప్పులు చేసిందని, వారిని ఎంపిక చేసే ముందు ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందన్నారు. 
 
అలాగే, అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రం 'మనం'కు అవార్డు ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇకపై క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరమూ అవార్డులు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. అయితే, ఒకే సామాజికవర్గానికి చెందిన నంది అవార్డులు ఇచ్చాయన్న అంశంపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు