మమ్మల్ని కాదు... ఎస్వీఆర్ యాక్టింగ్ చూడమని చెర్రీతో చెప్పా: చిరంజీవి

శనివారం, 8 జూన్ 2019 (22:37 IST)
''తన తండ్రికి, తనకు, తన కుమారుడు రామ్‌చరన్‌కూ ఎస్‌.వి.రంగారావు నటుడిగా ఆదర్శంగా నిలిచారని'' మెగాస్టార్‌ చిరంజీవి తెలియజేశారు. 'మహానటుడు' ఎస్‌.వి.రంగారావు ఫొటోబయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ప్రముఖ రచయిత, కల్చరల్‌ సొసైటీ అధ్యక్షుడు సంజయ్‌ కిశోర్‌ రూపుదిద్దిన ఈ పుస్తకాన్ని మెగాస్టార్‌ చిరంజీవి హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నటనకు పర్యాయపదం ఎస్‌.వి.రంగారావు. మా తండ్రిగారు నటనంటే ఇష్టం. ఆయన ప్రభుత్వోద్యోగి అయినా ఖాళీ సమయాల్లో నాటకాలు ఆడేవారు. ఎస్‌.వి.రంగారావు నటన అంటే చాలా ఇష్టం. జగత్‌జట్టీలు అనే చిత్రంలో ఆయనతోపాటు నటించే చిన్న అవకాశం నాన్నగారికి దక్కింది. ఈ విషయాన్ని ఆయన చెబుతుంటే నాకూ నటనపై మక్కువ ఏర్పడింది. 
 
ఆయన నటించిన చాలా చిత్రాలు చూసి నటన నేర్చుకున్నాను. నా తర్వాత రామ్‌చరణ్‌ నటుడిగా అవ్వాలనుకుంటున్నప్పుడు ఎస్‌.వి.ఆర్‌. చిత్రాలు చూడమని చెప్పాను. తను ఆయన చిత్రాలే ఎక్కువగా చూసేవాడు. ఆ రకంగా మా కుటుంబానికి ఆదర్శమనే చెప్పాలి. అలాంటి మహోతన్నత వ్యక్తి పేరుతో పుస్తకం రూపొందడం దాన్ని నా చేతులమీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
 
పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్‌ మాట్లాడుతూ... ఇంతకుముందు 'సావిత్రి, మన నాగేశ్వరరావు' లాంటి పుస్తకాలు రాశాను. ఎస్‌.వి.రంగారావుపేరుతో పలు పుస్తకాలున్నా.. ఆయనకు చెందిన ఫొటోలు ఎక్కడా సరైనవి లేవు. అందుకే ఆ కోణంలో ఫొటో బయోగ్రఫీ చేయాలని నిర్ణయంతో దీన్ని రూపొందించాను. 
 
ఇందుకు చెన్నై, రాజమండ్రి, ఎస్‌విఆర్‌ పుట్టిన ధవళేశ్వరం తదితర ప్రాంతాలకు వెళ్ళి సేకరించడానికి చాలా కష్టపడ్డాను.  ఇటువంటి నటుల చరిత్ర భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో చేశాను. ఇందుకు ఆర్థికంగా పలువురు ప్రముఖులు సహకారాన్ని అందించారు. వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
 
బ్రహ్మానందం మాట్లాడుతూ... సంజయ్‌ కిశోర్‌ కృషిని అభినందించారు. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం భావితరాలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా చలనచిత్రరంగంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన చిరంజీవి పేరున కూడా ఇటువంటి పుస్తకాన్ని తీసుకురావాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అలీ, తనికెళ్ళభరణి, మండలి బుద్ధప్రసాద్‌, జయలలిత, రోజారమణి, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొని ఆయన గొప్పతనాన్ని విశ్లేషించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు