నీ జత లేకా.. పిచ్చిది కాదా మనసంతా... బాహుబలికి మళ్లీ చేరువైన దేవసేన

శుక్రవారం, 7 జులై 2017 (02:42 IST)
మెచ్చేనులే దేవసేనా... బాహుబలి 2లో మెరుపులో మెరిసిన హంస పాటలో పల్లవిలో భాగం ఇది. దేవసేన మెచ్చిందో మెచ్చలేదో కానీ అఖిల భారత ప్రేక్షకులు, ప్రపంచ సినీ జీవులు సైతం ఆ జంటను హిట్ పెయిర్‌గా క్యూటెస్ట్ జంటగా ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నాయి. రెండు నెలలుగా ప్రభాస్, అనుష్క మధ్య కెమిస్ట్రీ గురించి, వారి వ్యక్తిగత జీవితం గురించి భారతీయ చిత్రపరిశ్రమ కోడై కోస్తూనే ఉంది. ఎందుకు వారంటే అంత పిచ్చి అభిమానం అంటే వారు నటించిన పాత్రలు అలాంటివి. అమరేంద్ర బాహుబలి, దేవసేన.. కోట్లాది ప్రేక్షకులను దాసోహుల్ని చేసిన అతిగొప్ప పాత్రలు. భారతీయ ప్రజానీకం వారిద్దరినీ చూసి ఫిదా అయిందంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
 
బాహుబలి-2లో అమరేంద్ర బాహుబలి, దేవసేనల జంటను మనదేశమే కాదు ప్రపంచదేశాల ప్రేక్షకులు తెగ మెచ్చేశారు. అంతగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రభాస్, అనుష్కల జంట అంతకు ముందే బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించి హిట్‌ పెయిర్‌గా నిలిచారు. బాహుబలి-2తో ఈ జంట మళ్లీ కలిసి నటిస్తే బాగుండు అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి-2 చిత్రం తరువాత ప్రభాస్‌ సాహో అనే త్రిభాషా(తమిళం, తెలుగు, హిందీ) చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రంలోనూ ఆయనకు జంటగా అనుష్క నటిస్తే బాగుంటుందని భావించిన వారు లేకపోలేదు.
 
అయితే సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సాహో చిత్రంలో వేరే హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్‌ బ్యూటీస్‌ సోనంకపూర్, అలియాభట్, పూజాహెగ్డేలతో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడ్డాయి.దీంతో ఈ చిత్రంలో అనుష్కకు అవకాశం లేదేమో అనుకున్న వారికి శుభవార్త సాహో చిత్రంలో అనుష్కనే హీరోయిన్‌​అన్నది. దీనికి సంబంధించిన అధికారకపూర్వ ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద ప్రభాస్, అనుష్క ఐదోసారి జత కట్టనున్నారన్నమాట. మరి ఈ జంట మళ్లీ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా అన్నది వేసి చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి