ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అమిత్ షా తేనీటి విందు

శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (16:15 IST)
"ఆర్ఆర్ఆర్" చిత్ర బృందంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీకానున్నారు. తన తెలంగాణ రాష్ట్ర పర్యటన సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంతో సమావేశమై బృందానికి తేనీటి విందును ఇస్తారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఈ యేడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో తన ఉనికిని చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన వారి అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
పైగా, వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణాలో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉంది. దీంతో తెలంగాణపై అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ బృందంతో సమావేశంకానున్నారు. 
 
ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా... ఆర్ఆర్ఆర్ బృందాన్ని సత్కరించేందుకు షా ఏప్రిల్ 23న హైదరాబాద్‌కు రానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యులతోనూ ఆయన సమావేశమై అదేరోజు మధ్యాహ్నం చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లను ఢిల్లీకి చర్చించారు కూడా.  
 
ఇదిలావుంటే, అమిత్ షా హైదరాబాద్ షెడ్యూల్ పర్యటన ఖరారైంది. ఆదివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.30 గంటలకు విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వెళతారు. అక్కడ ఆస్కార్ అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని కలుసుకుని, 4 గంటల నుంచి 4.30 గంటల వరకు తేనేటి విందులో పాల్గొంటారు. 
 
ఆ తర్వాత 4.30 గంటల నుంచి 5.10 గంటలకు బీజేపీ కోర్ కమిటీతో సమావేశమవుతారు. ఆ తర్వాత 5.15 గంటలకు చేవెళ్లకు బయలుదేరి వెళతారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7.45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు