పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా బ్రహ్మా ఆనందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ తెరకెక్కించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఈ ఈవెంట్‌లో.చిరంజీవి మాట్లాడుతూ, నా మిత్రుడు బ్రహ్మానందం గురించి అయితే నేను కచ్చితంగా వస్తానని ఈ వేడుకకు వచ్చా. . చంటబ్బాయ్ పాట షూటింగ్ లో నేను బిజీగా ఉన్నప్పుడు.. ఓ వ్యక్తి విజిల్స్ వేస్తూ నానా హంగామా చేశాడు. అత్తిలి లెక్చరర్ అండి అని జంధ్యాల గారు చెప్పారు. వెంటనే అతడ్ని పిలిచి మాట్లాడాను. మిమిక్రీ కూడా చేస్తాడని తెలిసి సాయంత్రం రమ్మని అన్నాను. అలా ప్రతీ రోజూ సాయంత్రం వచ్చేవాడు. రన్నింగ్ కారెక్టర్ అని జంధ్యాల గారు బ్రహ్మానందంకి పాత్ర ఇచ్చి చాలా ఏడ్పించాడు. అలా మా స్నేహం మొదలైంది. ఇంత టాలెంట్ ఉన్న ఈ వ్యక్తి ఇక్కడే ఉండిపోకూడదని అనుకున్నాను. మద్రాస్‌కు తీసుకెళ్తే ఈ టాలెంట్‌ను అందరూ వాడుకుంటారు అని అనుకున్నాను.
బ్రహ్మానందంను ఇంటికి తీసుకెళ్తే నా తమ్ముళ్లు వింతగా చూశారు. నాతో పాటు బ్రహ్మానందంను ప్రతీ చోటకు తీసుకెళ్లేవాడ్ని. బ్రహ్మానందుకు నేను అంబాసిడర్, ఏజెంట్‌ను అయి ప్రమోట్ చేశాను. అలా మొదలైన బ్రహ్మానందం ప్రయాణం నేటికి ఏ స్థాయికి వెళ్లిందో అందరికీ తెలిసిందే. బ్రహ్మానందం తన కొడుకుతో కలిసి చేసిన ఈ బ్రహ్మా ఆనందం మూవీని అందరూ ఆదరించాలి. ఈ మూవీని తీసిన నిఖిల్, నిర్మాత రాహుల్‌కు ఆల్ ది బెస్ట్. రఘు బాబు, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి వారు నటించడంతో పరిపూర్ణత చేకూరినట్టు అయింది. ప్రియ, ఐశ్వర్య, దివిజలకు ఆల్ ది బెస్ట్. ఇలాంటి చిత్రాలను ఆదరించండి. ఇలాంటి వేడుకకు నన్ను పిలిచిన నా సోల్ మేట్ బ్రహ్మానందంకు థాంక్స్. ఫిబ్రవరి 14న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నేను ఎలాగైతే పుత్రోత్సాహాన్ని పొందుతున్నానో.. నువ్వు (బ్రహ్మానందం) కూడా అంతే పుత్రోత్సాహాన్ని పొందుతావు అని అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ, బేవర్స్ తాత, ఎడమెంట్ మనవడు కలిసి చేసే ప్రయాణమే ఈ మూవీ. ఈ కథను నిఖిల్ ఎంతో అద్భుతంగా రాసుకున్నాడు. అంతే అద్భుతంగా తీశాడు.
మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది. నాలుగు దశాబ్దాలుగా పరిచయం ఉంది. ఖైదీ సినిమాను చూసి షాక్ అయ్యాను. ఆయన ట్రెండ్ సెట్టర్. ఘరానా మొగుడు వంద రోజుల ఫంక్షన్ గుంటూరులో జరిగింది. ఇసుక పోస్తే రాలనంత జనం వచ్చారు. అదీ ఆయన రేంజ్. బెజవాడ నుంచి గుంటూరు వరకు మేం వెళ్తుంటే.. మాతో పాటు ర్యాలీగా వచ్చారు. అదీ ఆయన స్థాయి. ఆయన కాలు కదిపితే రాష్ట్రం మొత్తం షేక్ అయ్యేది. డ్యాన్స్, ఫైట్స్ అంటే కేవలం చిరంజీవి గారే గుర్తుకు వచ్చేవారు. ఆ తరువాత మా పొట్ట కొడతాడేమో అని అనుకున్నా. కామెడీ కూడా అద్భుతంగా పండించేవారు. ఆయన ఏది చేసిన అద్భుతం, ఆశ్చర్యం. అందుకే ఆయన్ను కారణ జన్ముడు అని అంటారు. ఆయన చూడని చరిత్రా.. తెలియని చరిత్రా.. ఆయన కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిల్మ్. రగులుతోంది మొగలిపొద సాంగ్‌ను చూస్తే ఆయన బాడీ స్ప్రింగులా అనిపిస్తుంది. కొరియోగ్రాఫర్లు సైతం కొత్తగా ఏం చేయించాలా? అని కంగారు పడేవారు.
చిరంజీవి గారిని పదే పదే పిలుస్తున్నాను కదా.. బాగుంటుందా? లేదా? అని అనుకున్నాను. రాజా రవీంద్రతో అదే మాట అన్నాను. ఆ మాట చిరంజీవి గారికి చెప్పాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఏరా.. నన్ను పిలవడానికి వెనుకాముందు ఆడుతున్నావ్ అని అన్నారు. రాజా గౌతమ్ నాకూ బిడ్డ లాంటివాడే.. టైం, డేట్ చెప్పు.. నేను వస్తాను అని అన్నారు. ఆయన నిజంగానే భోళా శంకరుడు. హద్దులు లేనటువంటి వారే చిరంజీవి. నన్ను చేయి పట్టుకుని విమానం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు నా బిడ్డని ఈ విమానం ఎక్కిస్తున్నారు. ఈ మూవీని చూశాను. చాలా అద్భతుంగా ఉంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రాబోతోంది అని అన్నారు.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ .. బ్రహ్మా ఆనందం సినిమాకు గెస్టుగా రావడం గౌరవంగా భావిస్తున్నాను. చిరంజీవి గారు, బ్రహ్మానందం గార్లతో స్టేజ్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. బ్రహ్మానందం గారితో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. చిరంజీవి గారితోనూ పని చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. రాజా గౌతమ్‌లో చాలా ప్యాషన్ ఉంటుంది. అతనికి ఇంకా రావాల్సిన సక్సెస్, గుర్తింపు రాలేదు. ఈ బ్రహ్మా ఆనందం పెద్ద హిట్ అవుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. నిర్మాత రాహుల్ గారు వరుసగా సక్సెస్‌లు సాధిస్తున్నారు. మంచి అభిరుచి ఉన్న నిర్మాత. రాహుల్ గారికి ఆల్ ది బెస్ట్. ఎంత ఎదిగినా, పెరిగినా ఎంతో ఒదిగి ఉంటాడు. ఈ చిత్రంలో నటించిన, పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. రాజా గౌతమ్ తనని తాను సొంతంగా ఫ్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. కొడుకు సక్సెస్‌తో బ్రహ్మానందం గారి మనసు నిండిపోవాలని అనిపించింది. టీంకు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. అన్నారు.