అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎంపికై జో బైడెన్‌ను ఉద్దేశించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. జో బైడెన్‌ను ఓ గజినీతో పోల్చారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి డేటా క్రాష్ అయిపోయే గజినీ అంటూ వ్యాఖ్యానించారు. ఆయనకు ఇంజెక్ట్ చేసిన మందుల వల్ల ఏడాదికి మించి బైడెన్ ఉండరన్నారు. మొత్తం షోను నడిపించబోయేది కమల హ్యారిస్ అని చెప్పుకొచ్చారు.
ఒక మహిళ ఎదిగినప్పుడు... ఇతర మహిళలకు కూడా ఆమె మార్గాన్ని చూపిస్తుందని అమెరికా ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికై కమలా హారిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించబోతున్న కమల మాట్లాడుతూ, తాను ఈ బాధ్యతలను స్వీకరించబోతున్న తొలి మహిళనే కావచ్చు... కానీ, చివరి మహిళను మాత్రం కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను కంగనా స్వాగతించారు.
కాగా, అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ 290 మంది ఎలక్టోరల్ ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయనకు డిప్యూటీగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ విజయభేరీ మోగించారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే సాధించి ఓడిపోయారు.