నచ్చని నేతలపై ఆగ్రహిస్తారు. నచ్చని సినిమాలను పట్టించుకోరంటున్న ఎస్పీ బాలు

సోమవారం, 23 జనవరి 2017 (06:25 IST)
తమకు నచ్చని నాయకుడిపై రోడ్లపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసే ప్రజలు.. తమకు నచ్చని సినిమా, పాటను వ్యతిరేకించే విషయంలో ఎందుకు ముందుకు రారని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రశ్నించారు. కన్నడ, తమిళుల మాదిరిగా మన తెలుగు వాళ్లకు భాష మీద ప్రేమ ఎందుకు పెరగడం లేదని తాను నిరంతరం మధనపడుతూ ఉంటానని చెప్పారు. కళలను, మన సంగీతాన్ని కాపాడుకునే విషయంలో సంకెళ్లు వేసుకుని నపుంసకులుగా ప్రజలు బ్రతుకుతున్నారన్న బాధను బాలు వ్యక్తం చేశారు. 
 
విజయవాడ రోటరీ క్లబ్ తనకు జీవన సాఫల్యపురస్కారం అందజేసిన సందర్భంగా బాలు నేటి సినిమాలు, కళలు, ప్రజల్లో నిర్లక్ష్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు తన మనసులోని భావాలను బాలు పంచుకున్నారు. జాతులు, కులాల కొట్లాట మధ్య కళలు చనిపోవడం ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్న అతిపెద్ద బాధాకర పరిణామమని అభిప్రాయపడ్డారు.

తమ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే సోకాల్డ్ ఫ్యాన్స్.. ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని ఎందుకు ప్రశ్నించరని అన్నారు. అగ్ర కథానాయకులు కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలని సూచించారు. ‘దంగల్‌’ వంటి సినిమాలు తెలుగు హీరోలు చేయాలని కోరారు.
 
హీరోలు కనీసం ఒక్క సినిమా జాతి, భాష కోసం చేయాలని అన్నారు. ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తే ఒక్కటైనా జాతీయ అవార్డు వచ్చేలా నటించాలన్నారు. మిథునం లాంటి సినిమాకు ధియేటర్లే దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు వస్తే నిర్ధాక్షిణ్యంగా చిన్న సినిమాలను ధియేటర్ల నుంచి తీసేస్తున్నారని వాపోయారు. సినిమాల స్థాయిని నిర్ణయించేది ప్రేక్షకులేనని చెప్పారు. తెలుగువాళ్లు ఐక్యత, అంకితభావం లేనివాళ్లని ఎస్పీ బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కాగా, తన మనసులో భావాలను ఒక బహిరంగ వేదికపై బాలు ఇలా మనసువిప్పి పంచుకోవడాన్ని కళాభిమానులు కరతాళ ధ్వనులతో నిలబడి హర్షం పిలికారు.
 

వెబ్దునియా పై చదవండి