"ఎంఎస్.ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ" చిత్ర నటుడు ఆత్మహత్య?

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (07:20 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోకా, ఈ కేసు దేశ వ్యాప్తంగా పెను సంచలనమైంది. సుశాంత్ మరణం రేపిన గాయం ఇంకా రగులుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో బాలీవుడ్ నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని పేరు సందీప్ నహర్. 
 
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తరకెక్కిన ఎంఎస్.ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ అనే చిత్రంలో నటించాడు. ముంబై, గోర్‌గావ్ ప్రాంతంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. సూసైడ్ నోట్‌ కూడా రాసిపెట్టాడు.
 
వ్యక్తిగత సమస్యలు, భార్యతో విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పరిస్థితులను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ విషయంలో తన భార్యను నిందించవద్దని కోరాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కారని పేర్కొన్నాడు. ఫేస్‌బుక్‌లో అతడు పోస్టు చూసిన వెంటనే స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆత్మహత్యను ఆపేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది.
 
సందీప్ ఆత్మహత్యపై అతడి స్నేహితుడు బాల్జీత్ మాట్లాడుతూ.. అతడు చాలా భావోద్వేగాలు కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడడని పేర్కొన్నాడు. నహర్ కుటుంబం ప్రస్తుతం చండీగఢ్‌లో ఉందని, అంత్యక్రియల కోసం మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్తామన్నాడు. కుటుంబ సమస్యల గురించి నహర్ ఎప్పుడూ స్నేహితులతో పంచుకోలేదని, చాలా కాలంగా అతడు ముంబైలో ఒంటరిగానే ఉంటున్నట్టు బాల్జీత్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు