మురళీధరన్ రోల్ మోడల్ : వీవీఎస్ లక్ష్మణ్ - అరగంటలో విమానంలో బిర్యానీలు వచ్చాయి : మురళీధరన్

సోమవారం, 25 సెప్టెంబరు 2023 (17:01 IST)
Sivalenka Krishnaprasad, VVS Laxman, Muralidharan, Madhur Mittal
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు.

శ్రీదేవి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా సోమవారం హైదరాబాద్ లో '800' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బిగ్ టికెట్ ఆవిష్కరణ లక్ష్మణ్ చేతుల మీదుగా జరిగింది. 
 
వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ''మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్. బాల్యం నుంచి రిటైర్ అయ్యే వరకు, ఇప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటార్ కూడా! అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి అపోజిట్ టీంలో ఆడాను. వ్యక్తిగతంగానూ అతనితో పరిచయం ఉంది. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్ కి క్రికెట్టే జీవితం'' అని అన్నారు. 
 
ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ''ఫస్ట్ టైమ్ 1998లో లక్ష్మణ్ ను చూశా. ఒరిస్సాలోని కటక్ లో మ్యాచ్ ఆడాం. నా కంటే వయసులో లక్ష్మణ్ చిన్న. అప్పుడు టీనేజర్ అనుకుంట! అప్పుడే తన ఆటతో లక్ష్మణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇండియన్ టీంలో ఎందుకు లేడని అనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి. ఢిల్లీలో అనుకుంట... ఒక్కసారి నేను అతడిని అవుట్ చేశా. శ్రీలంకలో ఆడినప్పుడు కూడా లక్ష్మణ్ వికెట్ మెండిస్ తీసేవాడు. నేను అవుట్ చేయలేకపోయేవాడిని. లక్ష్మణ్ గొప్ప క్రికెటర్. నాకు క్లోజ్ ఫ్రెండ్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు మేం చాలా రోజులు కలిసి పని చేశాం. మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ... మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ స్నేహితులుగా ఉన్నాం.
 
 క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం! హైదరాబాద్ నాకు స్పెషల్... నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు. ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. సరదాగా బిర్యానీ అడిగా. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు ఉన్నాయి. లక్ష్మణ్ అంటే అది'' అని చెప్పారు. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే... ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ''వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు'' అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడానని ఆయన తెలిపారు. 
 
శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''దర్శకుడు శ్రీపతి నాకు 2004 నుంచి తెలుసు. తమిళంలో ఎస్పీబీ చరణ్ 'వర్షం' చేసినప్పుడు నేనూ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి శ్రీపతి తెలుసు. వెంకట్ ప్రభు దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. మేం ఓ సినిమా చేద్దామని అనుకున్నాం. శ్రీపతిని దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నా. ఆ సమయంలో మురళీధరన్ బయోపిక్ చేసే అవకాశం అతనికి వచ్చింది. ఆ విషయం చెబితే... బయోపిక్ ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం మంచి విషయం. సరేనన్నాను. విజయ్ సేతుపతితో '800' తీయాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కరోనా రావడంతో కొంత ఆలస్యం అయ్యింది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుటి నుంచి నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండేవాడు. ఒక మనిషి జర్నీలో ఇంత ఎమోషన్ ఉంటుందా? అని నేను చాలా సార్లు ఆశ్చర్యపోయా. నేను ఇన్ డైరెక్టుగా ట్రావెల్ అయిన సినిమా ఇది. రెండు నెలల క్రితం '800'లో భాగం అవుతానని ఆసక్తి చూపించా. సమంత గారితో నిర్మించిన 'యశోద' విజయం వల్ల నేషనల్ మార్కెట్ మీద కొంత అవగాహన వచ్చింది. మంచి వ్యక్తులు పరిచయం అయ్యారు. దాంతో '800' విడుదల చేస్తానని అడిగా. వాళ్ళు కూడా ఓకే అన్నారు. నేను భవిష్యత్తులోనూ మంచి సినిమాలు చేస్తా. అయితే, ఈ '800' నా జీవితంలో ఒక మెమరీ. కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. ఈ వేడుకకు పద్మశ్రీ వీవీఎస్ లక్ష్మణ్ గారు రావడం మా అదృష్టం'' అని అన్నారు.  
 
మధుర్ మిట్టల్ మాట్లాడుతూ ''ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు వేరే సినిమా చేస్తున్నా. ఆ షూటింగ్ అయిన తర్వాత ప్రతిరోజూ రెండు మూడు గంటలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశా. ఆయన శైలిని పట్టుకోవడం కొంచెం కష్టం. నాకు ఏడెనిమిదేళ్లు క్రితం కార్ యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు మోచేతికి గాయం అయ్యింది. అందువల్ల, ఆయన బౌలింగ్ యాక్షన్ దగ్గర దగ్గరగా నాది ఉంది. బౌలింగ్ కంటే ముత్తయ్య మురళీధరన్ గారి లుక్ రావడం కోసం ఎక్కువ కష్టపడ్డాం. ఈ విషయంలో మేకప్ టీమ్, డైరెక్షన్ టీమ్ అందరికీ క్రెడిట్ ఇవ్వాలి. లుక్ కోసం మేం ప్రతి రోజూ రెండున్నర గంటలు కష్టపడ్డాం. 17 ఏళ్ళ వయసు నుంచి రిటైర్ అయ్యే వరకు... డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. క్రికెట్ మాత్రమే కాదు, ఈ సినిమాలో అంతకు మించి ఉంది. ప్రజలకు తెలియని ఆయన జీవితం ఎంతో ఉంది. ఈ సినిమాను థియేటర్లలో అక్టోబర్ 6న విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని చూసి విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నా'' అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు