వివిధ రకాల పరీక్షల భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు హీరో సూర్య ఓ సందేశం ఇచ్చారు. నీట్ పరీక్ష భయం తమిళనాడు విద్యార్థులను ఇంకా వెంటాడుతోంది. ఇప్పటికే నీట్ ఒత్తిడితో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీ బిల్లు తీసుకొచ్చినా.. విద్యార్థుల్లో నీట్ పరీక్షపై ఆందోళన పోవడం లేదు.
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే నీట్ నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అయినా కూడా విద్యార్థుల బలవన్మరణాలు ఆగకపోవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో సందేశం విడుదల చేశారు. పరీక్షపై ఆందోళనతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, బంగారు భవిష్యత్ ఎంతో ఉందని సీఎం స్టాలిన్ సూచించారు.
సినీ నటుడు సూర్య కూడా విద్యార్థులకు ఓ వీడియో సందేశానిచ్చారు. భవిష్యత్తుపై నమ్మకంతో ఉండాలని సూచించారు. ఎవ్వరూ సూసైడ్ చేసుకోవద్దని కోరారు. ఫ్యూచర్ కచ్చితంగా బాగుంటుందని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అటు మానసిక ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది.