సినీ నటిగా, నాట్య కళాకారిణిగా శోభన గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో 'విక్రమ్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్ బాబు వంటి అగ్ర కథానాయకుల సరసన ఆమె నటించారు. 1980-1990 మధ్య తెలుగు, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. నటనతో పాటు శాస్త్రీయ నృత్యం అంటే శోభనకు ప్రాణం.
1989లో సొంతంగా ఓ డ్యాన్స్ స్కూల్‌ను ప్రారంభించారు. భరత నాట్యంలో శిక్షణ ఇచ్చేందుకు శోభన 1994లో 'కళార్పణ' అనే సంస్థను ప్రారంభించారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలో, నాట్యంలో శిక్షణ పొందుతున్నారు.
రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్.. వెండితెరపై రీల్ హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఫలితంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.
దేశంలోనే వెండితెరపై హీరోయిజాన్ని ప్రదర్శించే హీరోలకు ఏమాత్రం కొదవలేదు. కానీ, నిజ జీవితంలో అలాంటి తెగువను ప్రదర్శించగల అతికొద్ది మంది హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. దక్షిణాదిన అగ్రహీరోగా ఎదిగిన అజిత్ కుమార్ 1971లో పి.సుబ్రమణ్యం, మోహిని దంపతులకు తంజావూరులో జన్మించారు.
1990లో 'ఎన్ వీడు ఎన్ కనవర్' చిత్రంలో విద్యార్థిగా చిన్న పాత్రలో తెరపై తొలిసారి కనిపించారు. 'ప్రేమ పుస్తకం' చిత్రంలో తొలిసారి హీరోగా అజిత్ అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా విడుదలలో జాప్యం జరగడంతో ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం 'అమరావతి' ముందు విడుదలైంది. 1995లో వచ్చిన 'అసై' చిత్రం సూపర్ హిట్ కావడంతో అజిత్ ఇక వెనుదిరిగి చూడలేదు.