ఎన్టీఆర్‌తో వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ పలుకరించి రమ్మన్నారా...? హీరోల ఫ్రెండ్‌షిప్

శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (17:55 IST)
నిజమే.. మీరు చూస్తున్నది.. చదువుతున్నది నూటికి నూరు పాళ్లు నిజమే అనిపించకమానదు. ఒక అభిమాని హత్యతో ఇద్దరు హీరోల మధ్య పరిస్థితి భగ్గుమంటుందని అనుకున్నారు. కానీ అభిమాని ఎవరికైనా అభిమానే అని నిరూపించారు ఆ ఇద్దరు హీరోలు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఒకరు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మరొకరు జూనియర్‌ ఎన్‌టిఆర్‌. ఇద్దరు సినీపరిశ్రమలో అగ్రహీరోలే.
 
తిరుపతికి చెందిన వినోద్‌ రాయల్‌ పవన్‌ కళ్యాణ్‌కు వీరాభిమాని. చిన్నప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ ఎంతో ఇష్టం. ఒక్క సినిమానే కాదు సమాజ సేవ చేయడానికి వినోద్‌ ఎప్పుడూ ముందుండేవాడు. పవన్‌ కళ్యాణ్‌ పిలుపుతో అవయవదానం, పేదలకు తనకు తోచిన సహాయం చేయడం వినోద్‌కు అలవాటే. ఈ అలవాటే వినోద్‌ను ఎల్లలు దాటించింది. రెండు తెలుగురాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలకు వెళుతూ సేవ చేస్తుండేవాడు. ఆ సేవే చివరకు అతని ప్రాణాలను తీస్తుందని ఊహించి ఉండడు పాపం.
 
కొన్ని రోజుల కిందట కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో జరిగిన అవయవదానం కార్యక్రమంలో పాల్గొన్న వినోద్‌ అక్కడ జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అభిమానులతో ఘర్షణ జరిగింది. హీరోల మీద సెటైర్‌లు వేసుకుంటుంటే ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవకు దారితీసింది. ఆ ఘర్షణే చివరకు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అభిమానుల చేతుల్లో వినోద్‌ దారుణంగా హత్యకు గురవ్వడానికి కారణమైంది. హత్య తర్వాత పవన్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. నేరుగా వినోద్‌ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు పవన్‌. మీకు అండగా ఎప్పుడూ ఉంటానంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత తిరుపతిలో ఒక బహిరంగసభను ఏర్పాటు చేశారు కూడా. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.
 
ఆ తర్వాత నిజమైన ట్విస్టు ఉంది. ఒక్కసారిగా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తిరుపతిలో ప్రత్యక్షం. వినోద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయారు. అంతా కూడా సైలెంట్‌గానే జరిగిపోయాయి. అసలు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తిరుపతికి రావడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. ప్రసార మాధ్యమాల్లో మొత్తం కూడా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అభిమానులు హత్య చేశారని రావడంతో ఆయన రాక తప్పలేదు.
 
తన అభిమానులు ఇంత క్రూరత్వానికి దిగజారుతారని తాను అనుకోలేదని, మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఎన్‌టిఆర్‌ ధైర్యం చెప్పి వెళ్ళిపోయారట. ఇదంతా జనతా గ్యారేజ్‌ స్టంట్‌ అంటున్నారు కొంతమంది సినీప్రముఖులు. జనతా గ్యారేజ్‌ సినిమా కారణంగానే అభిమానుల మధ్య ఘర్షణ జరిగి హత్యకు దారితీసిందనేది పవన్‌ అభిమానుల ఆరోపణ. 
 
ఈ నేపథ్యంలో తాను వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించకపోతే ఏదైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావించారేమో ఎన్‌టిఆర్‌. అనుకున్నదే తడువుగా పరామర్శించి చడీచప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. అంతేనా కనీసం వినోద్‌ తల్లిదండ్రులను ఒక కోరిక కోరాడట. నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన మాట ఎక్కడ కూడా చెప్పొద్దన్నారట. దీంతో వినోద్‌ తల్లిదండ్రులు వెంకటేష్‌, వేదవతిలు అసలు ఏ మాత్రం నోరు విప్పడం లేదు. ఇదిలావుంటే జూనియర్ ఎన్టీఆర్ ను వినోద్ రాయల్ కుటుంబాన్ని ఓసారి పలుకరించి వస్తే వారి మనసులు కాస్త కుదుటపడుతాయని పవన్ సూచించారని సమాచారం. మరి ఏది నిజమో...?

వెబ్దునియా పై చదవండి