తమిళ 'బిగ్‌బాస్'కు షాక్... నిలిపివేయాలంటూ డిమాండ్...
సోమవారం, 7 ఆగస్టు 2017 (11:40 IST)
తమిళ బిగ్ బాస్‌కు షాక్ తగిలింది. ఈ రియాల్టీ షో ప్రసారాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిజానికి ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగుతూనే వుంది.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ షెనాయ్ సంస్థ ప్రెసిడెంట్ మహరాజన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బిగ్ బాస్ స్టూడియోకు ఓ 40 మంది ఆందోళనకారులు చేరుకొని షోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ రియాల్టీ షో తమిళనాడు సాంప్రదాయాలను మంటగలిపేలా ఉందని.. వెంటనే ఈ షోను నిలిపి వేయాలంటూ వారు నినాదాలు చేశారు. ఆ తర్వాత వారంతా బిగ్ బాస్ స్టూడియో లోపలికి ప్రవేశించడానికి యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు.
రీసెంట్‌గా షోలో జరుగుతున్న కొన్ని టాస్క్‌లు చాలా ఇబ్బందిగా ఉంటున్నాయని.. తమిళనాడు సాంప్రదాయాలను నాశనం చేసేలా ఉన్నాయనే విమర్శలు చెలరేగిన విషయం తెల్సిందే. మరోవైపు.. షోను నిలిపివేయాలని హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైన విషయం తెల్సిందే.