అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప-2' చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఇందులో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నాల నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరూ మరోమారు తమ నటనతో మెస్మరైజ్ చేశారంటూ అభినందిస్తున్నారు.
తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ కూడా బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన స్వయంకృషితో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు. అలాగే, పుష్ప చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశాలు.
గంగోత్రి చిత్రం నుంచి పుష్ప-2 చిత్రం వరకు చూస్తున్నాను. మిమ్మిల్ని మీరు తీర్చిదిద్దుకున్న తీరు అత్యద్భుతం. చాలా గర్వంగా ఉంది. ఇలాగే, మరింత ముందుకెళ్లండి. మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్, మాంత్రికుడు సుకుమార్ స్పెషల్ లవ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
అయితే అల్లు అర్జున్‌పై ప్రకాష్ రాజ్ ప్రశంసల గుప్పించడం వెనుక ఆయనకు మెగా ఫ్యామిలీపై ఉన్న ద్వేషమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్‌లు రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో నడుస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.