చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్న 'తలైవా'

ఆదివారం, 3 జనవరి 2021 (13:11 IST)
ఇటీవల అనారోగ్యానికిగురైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే అమెరికాకు వెళ్లనున్నారు. ఇప్పటికే తన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఆయన వెనక్కితగ్గారు. అయినప్పటికీ ఆయనపై తీవ్రమైన ఒత్తిడులతో పాటు విమర్శలు వస్తున్నాయి. వీటి నేపథ్యంలో మరింత మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు వీలుగా ఆయన అమెరికా వెళ్లి, అక్కడే వైద్యం చేయించుకోవాలని భావిస్తున్నారు. 
 
ఆయన నటిస్తున్న తాజా చిత్రం "అన్నాత్తై". ఈ చిత్రం షూటింగులో పాల్గొన్న నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో పాటు రజనీ సైతం తీవ్ర రక్తపోటుతో అనారోగ్యం పాలయ్యారు. దాంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకి పూర్తిగా విశ్రాంతి అవసరమని, 10 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదని వైద్యులు హెచ్చరించారు. 
 
పైగా, ఆయనకు ఇప్పటికే కిడ్నీమార్పిడి జరిగింది. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఇన్ఫెక్షన్‌ ముప్పు అధికం. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆయనకు వైద్యులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గత 31వ తేదీన పార్టీని ప్రకటించాలనుకున్న రజినీ.. వైద్యుల సూచనలతో దానిని విరమించుకున్నారు. రాజకీయ జీవితం ప్రారంభించకుండానే పక్కకు తప్పుకున్నారు. 
 
కానీ ఆది నుంచి ఆయన వెన్నంటివున్న రజనీ అభిమానులు దీనిని పూర్తిగా వ్యతిరేకించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో విమర్శల దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు సైతం ఆయనకు చురకలంటించాయి. వీటన్నింటి నేపథ్యంలో రజనీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. 
 
దీనిపట్ల తీవ్ర ఆందోళన చెందుతున్న కుటుంబీకులు ఆయనకు మానసిక చికిత్స అందించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగానే రజనీకాంత్ త్వరలో అమెరికాకు పయనమైవెళ్లనున్నారు. అయితే ఫిబ్రవరిలో "అన్నాత్తై" షూటింగ్‌ ప్రారంభమయ్యేనాటికి రజినీ తిరిగి వస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు