తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పి, కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమా "బాహుబలి". దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ సాధించాయి. ఈ సినిమా కోసం తమ విలువైన కెరీర్‌లో అత్యంత ఎక్కువ కాలాన్ని కేటాయించిన ప్రభాస్, రానా వంటి యాక్టర్స్‌కు మంచి స్థాయిలో గుర్తింపు వచ్చింది. హీరోగా ప్రభాస్‌కు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో విలన్ పాత్రలో నటించిన దగ్గుబాటి వారసుడు రానా దగ్గుబాటికి కూడా అంతే స్థాయిలో వచ్చాయి.
కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి హీరో పాత్రలకే పరిమితం కాకుండా విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ వచ్చిన రానా.. భల్లాళదేవ పాత్రతో మరో మెట్టు ఎక్కాడు. 'బాహుబలి: ద కంక్లూజన్' విడుదలై ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో బాహుబలి పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ, ‘రెండేళ్ల క్రితం ఇదే రోజు నా జీవితం మారిపోయింది. చిరస్థాయిగా నిలిచిపోయే భారతీయ సినిమా బాహుబలి' అంటూ పేర్కొన్నాడు.
ఈ ట్వీట్ పెట్టిన వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది, రీట్వీట్లు, లైక్‌లు, కమెంట్స్‌తో అభిమానులు మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. మరికొంత మంది అభిమానులు 'బాహుబలి' సినిమా తర్వాత తమ తదుపరి సినిమాల విడుదల విషయంలో జరుగుతున్న జాప్యంపై అభిమానులు ప్రశ్నిస్తున్నారు.