జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

ఠాగూర్

ఆదివారం, 26 జనవరి 2025 (12:51 IST)
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు జంటగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల వరద పారిస్తుంది. ఇప్పటికే రూ.260 కోట్లు రాబట్టినట్లు సమాచారం. త్వరలోనే రూ.300 కోట్లు వసూళ్లు చేసే అవకాశం ఉందని టీమ్‌ పేర్కొంది. 
 
విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. గత 24 గంటల్లో బుక్‌మైషోలో లక్షా 70 వేల టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. విడుదలైన నాటి నుంచి థియేటర్‌లో హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తోన్న ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్‌, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
 
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సంక్రాంతికి వస్తున్నాం విడుదలై విశేష స్పందన సొంతం చేసుకుంటోంది. అక్కడ ఈ సినిమా వెంకటేశ్‌ కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ వసూళ్లు సాధించింది. నార్త్‌ అమెరికాలో ఇప్పటి వరకు 2.6 మిలియన్‌ డాలర్లను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే అక్కడ మూడు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉన్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన తెలుగు సినిమాల రికార్డులను ఈ చిత్రం బ్రేక్‌ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. 
 
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయింది. మరోవైపు సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రముఖ నగరాల్లో సక్సెస్‌ మీట్‌లను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 26న భీమవరంలో ఈ విజయోత్సవం జరగనున్నట్లు నిర్మాతలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు