తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయని మంగ్లీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది. బళ్లారి మున్సిపల్ కాలేజీ మైదానంలో బళ్లారి ఫెస్టివల్ జరిగింది. ఇందులో ఆమె పాల్గొని, తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమె ప్రయాణిస్తున్న కారుపై దాడికి పాల్పడ్డారు.
ఇటీవల చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు మంగ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టేజీపైకి రావాలంటూ అక్కడున్నవారు యాంకర్ మంగ్లీని ఆహ్వానించారు. దీంతో ఆమె స్టేజీపైకి వెళ్ళగా, కన్నడంలో మాట్లాడాని యాంకర్ సూచించారు. అయితే, తనకు కన్నడ రాదని, పక్కనే అనంతపురం ఉన్నందుకు ఇక్కడివారికి కచ్చితంగా తెలుగు తెలిసివుంటుందని, అందువల్ల తెలుగులో మాట్లాడతానని చెప్పారు.
అయితే, యాంకర్ బలవంతం చేయడంతో ఒకటి రెండు మాటలు మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ, యాంకర్ మాత్రం మంగ్లీ చెప్పే మాటలు పట్టించుకోకుండా కన్నడంలోనే ప్రశ్నలు వేయసాగింది. మీరు అడిగే ప్రశ్నలు తనకు అర్థం కావడంలేదని, అందువల్ల సమాధానం చెప్పలేనని మంగ్లీ చెప్పారు. మంగ్లీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తలోవిధంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కారుపై దాడి జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.