ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో 'నాటు నాటు' పాట : రాజమౌళి

బుధవారం, 25 జనవరి 2023 (08:15 IST)
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ పాటకు మంగళవారం రాత్రి ప్రకటించిన జాబితాలో ఆస్కార్ నామినేషన్ (ఒరిజినల్ సాంగ్) లభించింది. దీనిపై ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తనదైనశైలిలో స్పందించారు. తన ఆనందాన్ని ఆయన ఓ ప్రకటన రూపంలో వెల్లడించారు. 
 
"నా సినిమాలో మా పెద్దన్న (కీరవాణి) తన పాటకు గాను ఆస్కార్ నామినేషన్ పొందారు. ఇంతకంటే ఇంకేం కావాలి. ఇపుడు నేను తారక్, చరణ్‌లను మించిపోయేలా వీరలెవల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నాను. 
 
చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్.. ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. మీకు నా వ్యక్తిగత ఆస్కార్ ఇచ్చేస్తాను. 
 
ఈ పాట విషయంలో చాలా కాలంగా సందిగ్ధంలో ఉన్నా నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న నమ్మకం కలిగించింది. థ్యాంక్యూ భైరి బాబు. 
 
ఇక ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణాలు ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య సమన్వయం, స్టయిల్. తమదైనశైలిలో వారు చేసిన డ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ వేల నేను పెట్టిన హింసకు వారిద్దరినీ క్షమాపణ కోరుతున్నా. చాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఆడుకోవడానికి నేను వెనుకాడనండోయ్...
 
అసలు నేనెపుడూ ఆస్కార్‌ వరకు వెళతానని అనుకోలేదు. ఇదంతా నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్‌కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. 
 
ఈ సందర్భంగా కార్తికేయ గురించి చెప్పుకోవాలి. అలుపెరగకుండా, పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నీ పట్ల గర్విస్తున్నాను కార్తికేయ. 
 
ఇక సోషల్ మీడియాలో రోజులో 24 గంటలూ ఆర్ఆర్ఆర్‌కు, నాటు నాటు పాటకూ ప్రచారం కల్పించడంలో కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు కృతజ్ఞతలు. ఆస్కార్‌కు మరొక్క అడుగు దూరంలో ఉన్నాం.. థ్యాంక్యూ.. అంటూ రాజమౌళి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు