ధృవ చిత్రం నుంచి ఆయన అందుకే వెళ్లిపోయాడు... సురేందర్ రెడ్డి క్లారిటీ

బుధవారం, 7 డిశెంబరు 2016 (14:08 IST)
రామ్‌ చరణ్‌ నటించిన 'ధృవ' చిత్రానికి బాలీవుడ్‌‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు కూడా పనిచేశారు. హీరో తనపై పెంచిన  నమ్మకాన్ని వమ్ము చేయకుండా తీశానని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి ముందుగా బాలీవుడ్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్‌ అశిమ్‌ మిశ్రాను ఎంపిక చేశారు. ఏక్‌ థా టైగర్‌, దబంగ్‌, భజరంగీ భాయ్‌జాన్‌ చిత్రాలకు ఆయన పనిచేశారు. ఏమయిందో కానీ ఆయన స్థానంలో పీ.ఎస్‌.వినోద్‌ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీనిపై పలు రకాలుగా పుకార్లు వచ్చాయి. 
 
దీనిపై సురేందర్‌ రెడ్డి క్లారిటీ ఇస్తూ.. ''అశిమ్‌ మిశ్రా ధవ సినిమాకు ఒప్పుకునే ముందే 'బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ సినిమా ఒకటి ఉంది, అది మొదలైతే ఏ రోజైన ధృవ నుంచి వెళ్ళిపోతా' అని చెప్పారు. అనుకున్నట్లుగా మేము ఇచ్చిన టైమ్‌ ప్రకారం ఆయన చేశారు. కానీ.. రామ్‌ చరణ్‌ పాత్ర రీత్యా బాడీని బిల్డప్‌ చేసే క్రమంతో షెడ్యూల్‌ కొద్దిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ టైంలో సల్మాన్‌ ఖాన్‌ సినిమా ప్రకటించారు. ఆ సమయంలో మిశ్రా వచ్చి విషయాన్ని వివరించారు. నేను కేవలం వారంరోజులు పనిచేశాను. 
 
కాని సినిమా మొత్తం ఒక్కరే చేయడం సినిమాకు హెల్ప్‌ అవుతుంది. అయితే.. హిందీ సినిమా షెడ్యూల్‌ ప్రకారం నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి నన్ను రిలీవ్‌ చేయండని చెప్పారు. పైగా.. ఇచ్చిన రెమ్యూనరేషన్‌ తిరిగి ఇచ్చేశారు. ఇదే వేరే వారు అయితే.. అస్సలు వెనక్కు ఇవ్వరు. ఈ విషయాన్ని నేరుగా అల్లు అరవింద్‌గారితో కూడా మాట్లాడాడు. ఆయన ఎంతగానో అభినందించారు. ఎలాగైనా తదుపరి చిత్రానికి మిశ్రా తప్పకుండా పనిచేస్తారని.. చెప్పారు.

వెబ్దునియా పై చదవండి