తన సినీ కెరీర్ విషయంలో తాను అతిగా ప్లాన్ చేసుకున్నట్టు బాలీవుడ్ నటి తాప్సీ పన్ను వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి తర్వాత ఎక్కువ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటుడుగా అక్షయ్ కుమార్ గుర్తింపు పొందారు. హీరోయిన్లలో మాత్రం తాప్సీ పన్ను. ఈ నాలుగేళ్ల వ్యవధిలో ఆమె నటించిన 11 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని విజయాలు అందుకున్నాయి. మరికొన్ని మిశ్రమ స్పందనలకే పరిమితయ్యాయి. అయితే, తన సినీ కెరీర్‌పై ఆమె స్పందిస్తూ, తన కెరీర్‌ను ఈవిధంగా ఉండాలని, ఇలా ముందుకు వెళ్లాలని తాను ప్లాన్ చేసుకోలేదన్నారు.
'కెరీర్ విషయంలో నేను అతిగా ప్లాన్ చేసుకున్నా. ప్రతీ సంవత్సరం నావి రెండు సినిమాలు విడుదల కావాలనుకున్నా. కరోనా వల్ల అది జరగలేదు. ఆ తర్వాత నా సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అయ్యాయి. దాదాపు నాలుగేళ్లలో 11 చిత్రాలు రిలీజై ప్రేక్షకులను అలరించాయి. వరుస రిలీజ్‌లను ప్లాన్ చేయలేదు. ఇక, ఇప్పుడు రెండు చిత్రాలు సుమారు ఆరు రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. ఇలాంటిది నేను కోరుకోలేదు. కానీ, దేవుడి దయ వల్ల.. ఒకటి థియేటర్‌లో మరొకటి డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతున్నాయి'
'పాత్రల ఎంపికలో మూసధోరణి పాటించకూడదని.. విభిన్నమైన రోల్స్ చేయాలని కెరీర్ ఆరంభించినప్పుడే నిర్ణయించుకున్నా. 'పింక్' తర్వాత వేధింపులు లేదా అత్యాచార బాధితురాలు వంటి పాత్రలే నా వద్దకు వచ్చాయి. నా దృష్టిలో అదొక ఐకానిక్ మూవీ. మళ్లీ అదేతరహా మూవీలో యాక్ట్ చేసి... ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను పాడుచేయడం నాకు ఇష్టం లేదు. అందుకే, 2016 నుంచి ఇప్పటివరకూ అలాంటి పాత్రలకు నో చెబుతూనే ఉన్నా. ఆ కారణంతోనే చాలా సినిమాలు చేయనని చెప్పా' అని ఆమె చెప్పారు.
'ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా' ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 2021లో విడుదలైన 'హసీనా దిల్ రుబా'కు ఇది కొనసాగింపుగా రానుంది. విక్రాంత్ మెస్సీ, సన్నీ కౌశల్ ముఖ్య పాత్రలు పోషించారు. మరోవైపు, ఆమె కథానాయికగా నటించిన 'ఖేల్ ఖేల్ మే' ఆగస్టు 15న థియేటర్లలో విడుదలకానుంది.