Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

సెల్వి

శుక్రవారం, 24 అక్టోబరు 2025 (19:06 IST)
మైసూరు రైల్వే స్టేషన్ పోర్టికో నుండి ఆరు నెలల పసికందును ఒక మహిళ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. అయితే కిడ్నాపైన ఆరు నెలల పసికందును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది 20 నిమిషాల్లోనే రక్షించారు.
 
వివరాల్లోకి వెళితే.. హసన్ పట్టణంలోని పెన్షన్ మొహల్లాలోని మోచి కాలనీకి చెందిన నందిని (45) అనే కిడ్నాపర్ మహిళను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. స్టేషన్‌లో శిశువు తల్లి పెద్దగా కేకలు వేసింది. ఆమె బిడ్డ తప్పిపోయినట్లు ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలిపింది. 
 
బుధవారం ఉదయం 5.20 గంటల ప్రాంతంలో ఆ శిశువు కనిపించకుండా పోయిన విషయాన్ని బాధితురాలు ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలియజేసింది. తన పక్కన నిద్రపోతున్న శిశువును ఎత్తుకెళ్లిపోయారని ఆ తల్లి ఆర్పీఎఫ్ సిబ్బందికి వెల్లడించింది. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ నాగరాజు ఏఎస్ఐ ప్రసీని అప్రమత్తం చేశారు. 
 
వెంటనే సిబ్బంది స్టేషన్‌లో వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించడం ప్రారంభించారు. ఒక మహిళ ఒక శిశువును ఎత్తుకుని సబ్‌వే ద్వారా ప్లాట్‌ఫామ్ నంబర్ 6 వైపు వెళ్తున్నట్లు వారు గమనించారు. హసన్‌లోని అరసికేరేకు వెళ్లే రైలు ఎక్కేందుకు ఆమె ప్రయత్నిస్తుండగా, ఆమె రైలు ఎక్కేలోపు వారు ఆమెను అడ్డుకున్నారు. 
 
దీనిపై ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, అరసికేరే వైపు వెళ్లే రైలు ఉదయం 6 గంటలకు మైసూరు స్టేషన్ నుండి బయలుదేరాల్సి ఉంది. నిందితురాలైన మహిళ రైలు ఎక్కేలోపు పట్టుబడింది. నిందితురాలిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, ఆ శిశువును ఆమె కన్నతల్లికి అప్పగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు