పది మందికి సాయం చేయాలనే మనస్తత్వం జేపీది... సినీ ప్రముఖుల సంతాపం (Video)
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (12:17 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన విలన్, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన జయప్రకాష్ రెడ్డి మంగళవారం వేకువజామున గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేసిన సందేశంలో.. "నా మనసుకి చెరువైన మిత్రుడు జయ ప్రకాష్ రెడ్డి ఇక లేడు. ఒక ప్రతినాయకుడిగా భయపెట్టి, ఒక నటుడిగా నవ్వించే రెండు వైవిధ్యాలను అవలీలగా చేయగల నైపుణ్యం అతడి సొంతం. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చి, ఆకస్మికంగా దూరమైన ఆత్మీయుడికి ఇదే నా ఆశ్రునివాళి" అని పేర్కొన్నారు.
అలాగే, హీరో మోహన్ బాబు చేసిన ట్వీట్‌లో... "జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానరులో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి తను. జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని షిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని పేర్కొన్నారు
అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సీఎం తన సంతాప సందేశంలో గుర్తుచేశారు.
అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సంతాప సందేశంలో.. 'తెలుగు సినిమా, థియేటర్ ఈ రోజు ఓ రత్నాన్ని కోల్పోయింది. దశాబ్దాలుగా ఇచ్చిన ఆయన బహుముఖ ప్రదర్శనలు మనకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఆయన కుటుంబానికి, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని పేర్కొన్నాడు.
'టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ రోజు ఉదయం గుంటూరులో గుండెపోటుతో మరణించడం బాధాకరం. ప్రత్యేకమైన స్లాంగ్‌తో తెలుగు సినీ ప్రేక్షకులకు చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
'జయప్రకాశ్ రెడ్డి మరణవార్త విని బాధపడ్డాను. ఆయన చాలా నిబద్ధతతో పనిచేసేవారు. ప్రతి పాత్రలో గొప్పగా నటించారు. 'సమరసింహా రెడ్డి' సినిమాలో ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
'నా ప్రియ మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. వెండితెరపై మా కాంబినేషన్ అద్భుతంగా ఉండేది. ఆయనను చాలా మిస్ అవుతాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు.
'జయప్రకాశ్ రెడ్డి మరణవార్త విని బాధపడ్డాను. టాలీవుడ్‌లో ఆయన ఓ గొప్ప కమెడియన్. ఆయనతో కలిసి పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని సినీనటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
'అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.
'సహచర నటుడు జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను' అని సినీనటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.