ఒకేరోజు మూడు చిత్రాలు విడుదల. ఇది నిజంగా సినీ అభిమానులకే పండుగే. ఈ మూడింటిలో బాహుబలి తరువాత రానా నటించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి" కావడంతో అభిమానుల అంచనాలు మించుతున్నాయి. దాంతో పాటు లవర్ బాయ్ నితిన్ పక్కా యాక్షన్ కథతో వచ్చిన "లై", మరోవైపు యాక్షన్ కథా చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన "జయ జానకి నాయక" సినిమా. ఈ మూడు ఒకేరోజు రిలీజవడంతో తెలుగు సినీ అభిమానులకు ఒక పండుగ వచ్చినట్లుంది.
అయితే ఈ మూడు సినిమాలు రిలీజయ్యాయి కానీ అందులో ఒక సినిమా హిట్ టాక్‌తోనూ.. మిగిలిన రెండు యావరేజ్ టాక్‌తో నడుస్తున్నట్లు సినీ వర్గాలు అప్పుడే చెప్పుకుంటున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'జయ జానకి నాయక' సినిమా హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళుతోంది. విభిన్న కథతో బోయపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. 'నేనే రాజు.. నేనే మంత్రి' సినిమా స్టోరి రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వినిపిస్తోంది. కేవలం రానా డైలాగ్‌లు, కాజల్ అందాలను చూడటానికి మాత్రమే తెలుగు ప్రేక్షకులు వెళుతున్నారట. స్టోరీలో కొత్తదనం కనిపించడం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మిగిలింది 'లై'. చాలా గ్యాప్ తర్వాత నితిన్ నటించిన సినిమా. ఒకప్పటి అగ్ర హీరో అర్జున్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా కథ కూడా కొత్తగా లేకపోవడంతో పాటు మొదటి భాగం మాత్రమే బాగుండటం, రెండో భాగం బోర్‌గా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను కూడా యావరేజ్‌గా తేల్చేశారట. మొదటి రోజు కావడంతో అన్ని థియేటర్లు మాత్రం హౌస్‌ఫుల్ కనిపిస్తున్నాయి కానీ.. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి తక్కువ రేటింగ్ ఇస్తుండటం గమనార్హం.