రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరెకెక్కించిన ఈ చిత్రం తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక తెలుగు సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి ఒక చెరగని అధ్యాయం. ట్రిపుల్ టీం ను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొనియాడుతున్నారు. పలువురు పలు రకాలుగా తమ గౌరవాన్ని, ప్రేమను తెలియజేస్తున్నారు.
తాజాగా నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఎడిసన్ నగరం న్యూ జెర్సీ లో పాపియోనా పార్క్ లో టెస్లా లైట్ షో ను నిర్వహించారు. సుమారు 150 టెస్లా కార్లు ఈ ఫీట్ లో పాల్గొన్నాయి. ఈ కార్లన్నిటిని RRR షేప్ లో పార్క్ చేసి "నాటు నాటు" పాటకు లైట్ షో ను నిర్వహించారు. ఒక సినిమాకి ఇటువంటి లైట్ షో ను నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ లైట్ షో చూడటానికి కేవలం టెస్లా ఓనర్స్ మాత్రమే కాకుండా, దాదాపు ఒక 500 మంది హాజరయ్యారు.
నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు వంశీ కొప్పురావూరి, ఉజ్వల్ కుమార్ కస్తల ఈ కార్యక్రమం సక్సెస్ లో ప్రముఖ పాత్రను వహించారు. ఎడిసన్ నగర మేయర్ సామ్ జోషి, అతని బృందం అతి తక్కువ టైములో సహకరించి దీనిని విజయవంతం చేసారు.
ఈ కార్యక్రమం అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరగడం విశేషం. విశ్వప్రసాద్ తెలుగులో అద్భుతమైన సినిమాలను కేవలం నిర్మించడమే కాకుండా, ఒక RRR వంటి తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంలో, తాను కూడా ఒక కీలకపాత్రను పోషించడం చెప్పుకోదగ్గ విషయం.