‘తాష్కెంట్ ఫైల్స్’లో సంతకం పెట్టాక శాస్త్రి ఎలా చనిపోయారు?

మంగళవారం, 26 మార్చి 2019 (12:55 IST)
దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలలోనూ ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు సిద్ధం కాగా... మరొకొన్ని సెట్స్‌పై ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఎన్టీఆర్, వైయస్ఆర్‌, కేసీఆర్‌ల బయోపిక్‌లు ఇప్పటికే తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే మరో వైపు దాదాపు పదేళ్లపాటు ఒక దేశ ప్రధానిగా పనిచేసిన కాలంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎదుర్కొన్న పరిణామాల నేపథ్యాన్ని వివరిస్తూ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ తెరకెక్కింది. 
 
తాజాగా ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై బయోపిక్ కూడా తెరకెక్కేసింది. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. అయితే, వీటన్నింటితో పాటు "జై జవాన్ జై కిసాన్" అంటూ నినదించిన మన దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మర్డర్ మిస్టరీపై తాజాగా ‘తాష్కెంట్ ఫైల్స్’ అనే సినిమా కూడా తెరకెక్కేసింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.
 
ఈ ట్రైలర్‌లో శాస్త్రి భారతదేశ రెండవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సన్నివేశాలు, ఆ తర్వాత ఆయన చనిపోయిన సన్నివేశాలను చూపించడం జరిగింది. 1966 జనవరి 10వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి ఒకప్పటి రష్యా తాష్కెంట్‌లో పాకిస్థాన్‌తో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఆ పత్రాలపై సంతకాలు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన చనిపోవడం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన మిస్టరీలాగే లాల్ బహదూర్ శాస్త్రి మరణం కూడా ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది.
 
ఆయన నిజంగానే హార్ట్ ఎటాక్‌తో చనిపోయారా? లేకపోతే విష ప్రయోగం వల్ల చనిపోయారా అనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. శాస్త్రి మరణంపై ఉన్న రహస్యాలను ఈ సినిమాలో చూపెట్టబోతున్నట్టు కనపడుతోంది. ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, నషీరుద్దిన్ షా, శ్వేతా బసు ప్రసాద్, పల్లవి జోషి, పంకజ్ త్రిపాఠి, రాజేష్ శర్మ, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా... సార్వత్రిక ఎన్నికలలో ఈ సినిమా ప్రభావం కాంగ్రెస్ పార్టీని ఎంత మేరకు ఇరుకున పెట్టనుందో మరి వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు