ఈ నెల 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తీవ్రమైనదిగా, పిరికిపందల చర్యగా పేర్కొంటూ యూఎన్ఎస్‌సీ తీర్మానం చేసింది.
ఈ దుశ్చర్య వెనుక కుట్రదారులను, నిర్వాహకులను, ఆర్ధికంగా సహకరించిన వారిని పట్టుకుని చట్టం ముందుకు తీసుకురావాలని పేర్కొంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం సహా సంబంధిత అధికారులకు అన్ని దేశాలు చురుగ్గా సహకరించాలని యూఎన్ఎస్‌సీ సూచించింది. తీవ్రవాద చర్యలకు ఎవరు ఉపక్రమించినా అది నేరమేననీ, దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని జైషే మహ్మద్ పేరును ప్రస్తావిస్తూ స్పష్టం చేసింది.
కాగా, ఈ ఉగ్రదాడిని ఇప్పటికే అమెరికా సహా పలు అరబ్ దేశాలు సైతం పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించాయి. మరోవైపు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు అడ్డుపడుతూ వస్తున్న చైనా సైతం పుల్వామా దాడిని ఖండిస్తున్నట్టు ఈ నెల 15న ప్రకటించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించరాదని స్పష్టం చేసింది.