రావు రమేష్ ఇప్పుడు సినీ ప్రేక్షకులకు ఈయన తెలియనివారు లేరు. ఈయన తండ్రి రావు గోపాలరావు. స్టేజీ నటుడినుంచి సినిమాల్లోకి వచ్చిన రావు గోపాలరావుది ప్రత్యేక శైలి, వాయిస్. పదాల విరుపు, మాటల ఆరోహణ, అవరోహణ, ఒత్తి పలకడం వంటి ఆయన ప్రత్యేకతలు. ముత్యాలముగ్గు సినిమాలో `సెగ్రెటరీ.. పైనేదో మర్డర్ జరిగినట్లులేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తుటి గెడ్డలాలేడు. మనిషిఅన్నాక కాస్త కళాపోషణ వుండాలయ్యా! అంటూ తన దైన శైలిలో పలికిన మాటలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇలా చాలా సినిమాల్లో ఆయనది ప్రత్యేక మేనరిజం. ఆ తర్వాత అలాంటి నటుడు మళ్ళీ రాడు అనుకోవడం పరిపాటే. కానీ ఆయన నట వారసునిగా ఆయన కుమారుడు రావు రమేష్ వచ్చాడు. ఈయనేమీ అంత ఈజీగా రాలేదు. అస్సలు నాకు నటుడిగా చేయాలని లేదండి బాబోయ్.. అంటూ తన స్నేహితులకు చెప్పినా వారు వినలేదు. ఆఖరికి బలవంతంగా నటుడు అయ్యాడన్నమాట. ఈ విషయాన్ని ఆయన ఓ సందర్భంలో చెబుతూ అంతా దైవనిర్ణయం. మన చేతుల్లో ఏమీ లేదన్నారు. అలాంటి నటుడు పుట్టినరోజు ఈరోజే. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం.