తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు శరత్ బాబు ఇకలేరు. ఆయన సోమవారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 71 యేళ్లు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో గత 40 రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటూ వచ్చారు.
నిజానికి తొలుత ఆయన్ను బెంగుళూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. శరీరం విషతుల్యంగా మారిందని, భోజనం వల్లో, లేకపోతే మరో సమస్య వల్లో శరీరంలోకి హానికర పదార్థాలు వెళ్లాయని వైద్యులు చెప్పారు. శరత్ బాబు భౌతిక కాయాన్ని చెన్నెకి తరలించే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు అసలుపేరు సత్యంబాబు దీక్షితులు. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. తెలుగు, తమిళం హిందీ, కన్నడ తదితర భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. 'రామరాజ్యం' చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన సీతాకోక చిలుక, సాగర సంగమం, మరో చరిత్ర, సితార, ఇది కథకాదు, సిసింద్రీ, స్వాతి తదితర చిత్రాల్లో సహాయ పాత్రలతో మెచ్చింది. ఆయన మూడుసార్లు నంది అవార్డు అందుకున్నారు.
తనకంటే వయసులో, సినీ కెరీర్‌లో పెద్దదైన ప్రముఖ నటి రమాప్రభను పెళ్లిచేరుకున్నారు. ఆమె నుంచి విడిపోయాక స్నేహా నంబియార్ అనే తమిళ మహిళను పెళ్లాడారు. 2011లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం సోదరి వద్ద, సోదరుల కొడుకుల వద్ద ఉంటున్నారు. శరత్ బాబు నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. హీరో నరేష్, పవిత్రా లోకేశ్‌లు ప్రధాన పాత్రలను పోషించారు. అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కనిపించారు.