ఇంతలా చొరవచూపించడానికి కారణం ఇరు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వమేనని తేలింది. అదెలాగంటే.. బోనీ కపూర్ సోదరి రీనా మార్వా కుమారుడైన మోహిత్ మోర్వాకు ఇటీవల దుబాయ్ వేదికగా వివాహం జరిగింది. ఇందులో వధువు పేరు అంతరా మోతివాలా. ఈమె (అంతరా) అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి స్వయానా అక్క కూమార్తె. ఈ పెళ్లితో అంబానీలకు బోనీ కపూర్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధం ఏర్పడింది.
అందుకే శ్రీదేవి దుబాయ్‌లో మరణించారన్న వార్త తెలియగానే అనిల్ అంబానీ తన ప్రత్యేక జెట్ ఫ్లైట్‌ను ఆగమేఘాలపై ముంబై నుంచి దుబాయ్‌కు పంపించారు. ఆ తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించడంలో తీవ్రజాప్యం జరిగినప్పటికీ.. ఫ్లైట్‌ను అక్కడే ఉంచారు. ఆ తర్వాత మంగళవారం రాత్రి శ్రీదేవి భౌతికకాయంతో ఈ ప్రత్యేక ఫ్లైట్ దుబాయ్ నుంచి బయలుదేరి ముంబైకు వచ్చింది.
అంతేనా.. భార్యను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న బోనీ కపూర్‌కు అనిల్ అంబానీ ఎంతో అండగా ఉన్నారు. ఓదార్చారు. మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్ళిలో సరదాగా గడిపిన శ్రీదేవి రెండు రోజులలో విగతజీవిగా మారడం బోనీ ఎంతో ఆవేదనకు గురయ్యాడు. అలాంటి సమయంలో అనిల్ అంబానీ ఆయనకు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు.
అంతేకాకుండా, శ్రీదేవికి సంబంధించి కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండిమరీ చూసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయం వచ్చే సమయానికి ముంబై విమానాశ్రయానికి అనీల్ కపూర్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. అక్కడ నుంచి భౌతికకాయాన్ని ముంబైలోని లోఖండ్ వాలాలోని శ్రీదేవి సొంత నివాసమైన గ్రీన్ ఏకర్స్‌కి ఆయన దగ్గరుండి తరలించారు. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్ ఏకర్స్‌కు ఆయన స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ రావడం గమనార్హం.