మారిటల్ రేప్స్ (ఇష్టం లేకపోయిన బలవంతంగా భర్త లైంగికదాడి చేయడంవంటివి)పై మహిళలు తిరగబడాలని నటి కత్రినా కైఫ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా.. మహిళలు తమపై జరుగుతున్న నేరాల విషయంలో ఏమాత్రం మౌనంపాటించరాదని, ఖచ్చితంగా తమ గొంతు విప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన 'వీ యునైట్' అనే సదస్సులో ఆమె మహిళల ఔన్నత్యాన్ని గురించి, మహిళల ప్రాధాన్యత గురించి మాట్లాడారు. బ్రిటీష్ పాలన కంటే ముందే భారతదేశంలో ఓ మహిళ దేశాధినేతగా కొనసాగిందని, అది అమెరికాలో ఇప్పటివరకు సాధ్యం కాలేదన్నారు.
ముఖ్యంగా సమాజంలోకి కొన్ని కట్టుబాట్లు తమను వేలెత్తి చూపుతాయేమోనని భయపడుతూ తమ ఆందోళనను, ఆలోచనలను, తమపై జరుగుతున్న నేరాలను ముఖ్యంగా మారిటల్ రేప్స్‌ను బయటకు చెప్పలేకపోతున్నారని, విద్యావంతులైన మహిళల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారిటల్ రేప్స్‌ను ఈ సమాజంలో ఎవరూ నేరంగా పరిగణించడంలేదని, ఇది దురదృష్టం అని వాపోయారు. అందుకే అలాంటివాటిని సహించకుండా ధైర్యంగా ప్రతి మహిళ తన గొంతు విప్పాలని ఆమె కోరారు.