విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం మెలోడీ స్వరపరిచిన యువన్

బుధవారం, 16 ఆగస్టు 2023 (17:50 IST)
Vishvak Sen, Neha Shetty
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలు గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియడ్-గ్యాంగ్‌స్టర్-డ్రామా గా రూపొందుతోన్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే చిత్రం కోసం యువ సంచలనం విశ్వక్ సేన్‌తో చేతులు కలిపాయి.
 
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని గ్రే పాత్రలో కనిపించనున్నారు. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథగా ఈ చిత్రం రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన 'డీజే టిల్లు' చిత్రంతో ‘రాధిక’గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నేహాశెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా, రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మస్తిష్కంలో పుట్టిన ఆలోచన. కథ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న ఆయన సృజనాత్మకతతో చిత్రాన్ని ఎంతో అందంగా మలుస్తున్నారు.
 
వైవిధ్య భరిత చిత్రాలతో తమ అభిరుచిని చాటుకున్న నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'ని ప్రేక్షకులను గొప్ప అనుభూతిని పంచే చిత్రంగా మలచడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా రూపొందిస్తున్నారు.
 
ప్రముఖ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన స్వర కల్పనలో హృదయాన్ని హత్తుకునే మొదటి గీతం 'సుట్టంలా సూసి', ఆగస్ట్ 16న మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన వేడుకలో విడుదలైంది.
 
విద్యార్థుల కోలాహలం నడుమ జరిగిన ఈ మ్యాజికల్ మెలోడీ ఆవిష్కరణకు హాజరైన యువన్ శంకర్ రాజా, విశ్వక్ సేన్, గాయకుడు అనురాగ్ కులకర్ణి, నేహా శెట్టి విద్యార్థులతో ముచ్చటించి వారిలో మరింత ఉత్సాహం నింపారు.
 
సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ.. " ఈ పాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దర్శకులు కృష్ణ చైతన్య స్వతహాగా గీత రచయిత అయినప్పటికీ మరొకరికి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. ఇంత మంచి సినిమాలో భాగంగా ఆనందంగా ఉంది" అన్నారు.
 
కథానాయకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "మల్లారెడ్డి కాలేజ్ నాకు సెంటిమెంట్. ఫలక్‌నుమా దాస్‌ మూవీ ఈవెంట్ కూడా అప్పుడు ఇక్కడే జరిగింది. నేను యువన్ గారి సంగీతానికి పెద్ద అభిమానిని. ఆయన స్వరపరిచిన ఎన్నో పాటలు ఏళ్ల తరబడి వింటూనే ఉంటాం. యువన్ గారితో కలిసి పని చేయాలని కోరుకునే వాడిని. ఇప్పుడు ఆ కల నిజం కావడం సంతోషంగా ఉంది. నాగ వంశీ అన్న నిర్మాణంలో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మధ్యలో ఒకట్రెండు కథలు కూడా అనుకున్నాం. అయితే ఒకసారి నేను వంశీ అన్నకి కాల్ చేసి.. నేను ఇంతవరకు లుంగీ కట్టలేదు.. ఒకసారి ఊరమాస్ సినిమా చేయాలనుంది.. నేను ఫస్ట్ లుంగీ కడితే నీ ప్రొడక్షన్ లోనే కడతా అని చెప్పాను. ఈ పాట సాప్ట్ గా ఉంటుంది. కానీ సినిమా మాత్రం మాస్ గా ఉంటుంది. థియేటర్లలో ఒక్కొక్కరికి శివాలెత్తి పోతుంది." అన్నారు.
 
కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ.. "సితార బ్యానర్ నాకు డీజే టిల్లు రూపంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా మరో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యువన్ గారు పని చేయడం ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది." అన్నారు.
 
దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. "యువన్ గారికి నేను పెద్ద అభిమానిని. ఇది నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఆయనతో కలిసి పనిచేసే అవకాశమిచ్చిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. యువన్ గారి సంగీతం,
అనురాగ్ కులకర్ణి గాత్రం, శ్రీ హర్ష గారి సాహిత్యం తోడై ఈ పాట ఎంతో అందంగా వచ్చింది." అన్నారు.
 
గీత రచయిత శ్రీ హర్ష ఈమని మాట్లాడుతూ.. "యువన్ గారి సంగీత సారథ్యంలో పాట రాయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు" అన్నారు.
 
అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ క్లాసికల్ మెలోడీ కొన్నేళ్ళపాటు ఖచ్చితంగా మన ప్లేలిస్ట్‌లలో భాగం కానుంది. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మెలోడీలను అందించడంలో దిట్ట అయిన యువన్ శంకర్ రాజా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కోసం మరోసారి అలాంటి మెలోడిని స్వర పరిచారు. శ్రీ హర్ష ఈమని అద్భుతమైన సాహిత్యం అందించారు.
 
శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పులూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచాలను పెంచాయి. ఈ చిత్రాన్ని  డిసెంబర్‌ 8 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు