సెప్టెంబరులో తెలుగు చైతన్యయాత్ర : యార్లగడ్డ

తెలుగు భాషా సంస్కృతి చైతన్యయాత్ర రెండో దఫా కార్యక్రమం సెప్టెంబరు నెలలో నిర్వహించనున్నట్లు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. విజయవాడ కవితా నిలయం నుంచి ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళం జిల్లా కథా నిలయంలో ముగింపు సందర్భంగా ఆయన పై విధంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ... ఇప్పటిదాకా విజయవాడ, కాకినాడ, తుని, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలలో చైతన్యయాత్రలు నిర్వహించినట్లు చెప్పారు. నార్ల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రెండో దఫా చైతన్య యాత్రలో... "జ్ఞానపీఠం నుంచి జ్ఞానపీఠం వరకు" అనే నినాదంతో తొలి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి స్వగ్రామం వరకు ఉంటుందని యార్లగడ్డ ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, అంతకుముందు శ్రీకాకుళం సూర్య మహల్ కూడలి నుంచి బాపూజీ కళా మందిరం వరకు భాషా చైతన్యయాత్ర కొనసాగింది.

ఇదిలా ఉంటే... విజయనగరం పట్టణంలో తెలుగు భాషా సంస్కృతి చైతన్య యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రను కలెక్టర్ జి. రామనారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్, గజల్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. యార్లగడ్డ మాట్లాడుతూ... పతి పాఠశాలలోనూ విధిగా తెలుగు భాష బోధన అమలు జరిగేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి