స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ నటించిన తాజా చిత్రం "అల వైకుంఠపురములో". త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే, నివేదా థామస్, టబు, జయరాంలు కీలక పాత్రలు పోషించారు. నిజానికి 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా' అనే చిత్రం తర్వాత అల్లు అర్జున్ మరో చిత్రంలో కమిట్ అయ్యేందుకు ఒక యేడాది సమయం తీసుకున్నాడు. అనేక తర్జనభర్జనల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు కమిట్ అయ్యాడు.
"జులాయి", "సన్నాఫ్ సత్యమూర్తి" చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో బన్నీకి సక్సెస్ వచ్చిందా? బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ హిట్ పడిందా? ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం కథ ఎలా ఉందో తెలుసుకుందాం.
చిత్ర కథ : రామచంద్ర(జయరాం) అనే వ్యక్తి ఓ కోటీశ్వరుడు. తన దగ్గర పనిచేసే వాల్మీకి(మురళీశర్మ)కి ఇచ్చిన చిన్న మాట వల్ల తనకు పుట్టిన బిడ్డను అతనికి ఇస్తాడు. అతని కొడుకును తను తీసుకుంటాడు. అలా రామచంద్ర - వాల్మీకిలు తమ బిడ్డలను మార్చుకుని ఎవరికీ తెలియకుండా పెంచుకుంటుంటారు. అయితే, రామచంద్ర - వాల్మీకిలు బిడ్డలు మార్చుకున్నారన్న విషయం ఒక్కగానొక్క నర్సుకు మాత్రమే తెలుస్తుంది. ఆమె ఓ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళుతుంది.
అయితే, వాల్మీకి తన కొడుకు బంటు(అల్లు అర్జున్)ని మధ్య తరగతి వ్యక్తిగానే పెంచుతాడు. అల వైకుంఠపురములోని రామచంద్ర దంపతులే తల్లిదండ్రులని చెప్పకుండా, దాదాపు వారిని కలవనీయకుడా చూస్తాడు. అయితే, రెండు దశాబ్దాల తర్వాత బంటుకి నిజమేంటో తెలుస్తుంది. అప్పుడు తనేం చేస్తాడు? తన తల్లిదండ్రులను చేరుకుంటాడా? లేదా? అనేదే మిగిలిన కథ. ఈ కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైనశైలిలో దృశ్యకావ్యంగా మలిచాడు.
చిత్ర విశ్లేషణ :
నిజానికి రామచంద్ర ఓ కోటీశ్వరుడు కాదు, వాల్మీకి ఓ మధ్యతరగతి యజమాని. పుట్టుకతో కోటీశ్వరుడైన బంటు. మధ్యతరగతి కుటుంబంలో ఎలా పెరుగుతాడు? అతని పెంపుడు తండ్రి వాల్మీకి మధ్యతరగతి ఆశలతో ఎలా పెంచి పెద్దచేస్తాడు? ఇలాంటి విషయాలను ఎంటర్‌టైనింగ్ పంథాలో దర్శకుడు తెరకెక్కించాడు.
మరో పక్క రామచంద్ర కొడుకుగా పెరిగేటప్పుడు బిజినెస్‌ను టేక్ ఓవర్ చేసుకోవడానికి ఇష్టం లేక ఎలాంటి ఇబ్బందులు పడతాడనేది కూడా తెరపై ఆవిష్కరించాడు. ఇక అమూల్య(పూజా హెగ్డే) ఓ టూరిజం కంపెనీ నడుపుతుంటుంది. ఆమె అసిస్టెంట్‌గా అల్లు అర్జున్ జాయిన్ అవుతాడు. ఒకరినొకరు ఇష్టపడే క్రమంలో అమూల్యకి, రామచంద్ర ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు.
తర్వాత అమూల్యను జయరాం తనింటి కోడలుని చేసుకోవాలనుకుంటాడు. అమూల్య తండ్రి దానికి ఓకే చెబుతాడు. అమూల్యకి సుశాంత్‌తో నిశ్చితార్థం జరుగుతుంది. ఈ బంటుకి తెలిసి అల వైకుంఠపురములోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడితో ఇంటర్వెల్ ముగుస్తుంది. ఈ పార్ట్‌లో డైరెక్టర్ ఎలాంటి ట్రాక్ మార్చకుండా, మళ్లింపు లేకుండా కథను ముందుకు తీసుకెళ్లాడు.
అదేసమయంలో కోటీశ్వర దంపతులైన జయరాం, టబులు విడిపోయివుంటారు. వారిని బంటి కలుపుతాడు. అలాగే రామచంద్ర వ్యాపారంలో విలన్స్ భాగాలు అడుగుతుంటే వారిని కూడా దారిలోకి తెస్తాడు. వీటిని కామెడీ ట్రాక్‌తో చిత్రీకరించాడు దర్శకుడు.
మధ్య తరగతి యువకుడిగా, నిజం తెలిసినప్పుడు అల వైకుంఠపురములో వచ్చిన తన సమస్యలను తీర్చుకుంటూ ఎలా ముందుకెళ్లాడనే కాన్సెప్ట్‌తో బన్నీ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. దాన్ని బన్నీ చక్కగా ముందుకు నడిపించాడు. ఇక బన్నీ డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అమూల్య రోల్‌కి పూజా హెగ్డే చక్కగా సూట్ అయ్యింది. సుశాంత్, అతని లవర్‌గా నివేదా పేతురాజ్ చక్కగా నటించారు. మురళీశర్మ చక్కటి పాత్ర చేశారు. సందర్భానుసారం సముద్రఖని, అజయ్ విలనిజం బావుంది.
ఇట టబు, జయరాం, నవదీప్, రాహుల్ రామకృష్ణ, సునీల్, హర్షవర్ధన్, సముద్రఖని, అజయ్ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇలాంటి కథాంశం చాలా సినిమాల్లోచూసిందే. దాన్ని త్రివిక్రమ్ రిచ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్ లాగినట్లు అనిపిస్తుంది.
తమన్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది. సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ సాంగ్స్ వినడానికే కాదు.. చూడటానికి కూడా చాలా చక్కగా చిత్రీకరించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. పి.ఎస్.వినోద్ కెమెరా వర్క్ చాలా బావుంది. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, అందంగా కనిపించింది.