మధ్యతరగతి కుర్రాడు ఫ్యామిలీ స్టార్ ఎలా అయ్యాడు? రివ్యూ రిపోర్ట్

డీవీ

శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (15:30 IST)
vijay-mrunalini
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, అభినయ, ప్రభాస్ శ్రీను
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్‌: కే యూ మోహనన్, దర్శకుడు: పరశురాం పెట్ల, నిర్మాతలు: దిల్ రాజు, సంగీత దర్శకులు: గోపీ సుందర్, ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
 
గీత గోవిందం హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాం పెట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా అనగానే సీక్వెల్‌గా వుంటుందని టాక్ నెలకొంది. హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ వుండంతో ఇదేదో స్టయిలిష్‌గా వుందని ట్రైలర్ చెప్పింది. కుటుంబ కథాచిత్రాలను తీసే దిల్ రాజు నిర్మాత కావడంతో ఫ్యామిలీ స్టార్ టైటిల్‌కు సార్దకత వుందనిపించింది. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలావుందో చూద్దాం.
 

vijay-mrunalini
కథ :
సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ). ఇద్దరు వదినలు, వారి పిల్లలు, అన్నలు. బామ్మ. వీరే తన సామ్రాజ్యం వారిని చక్కగా తండ్రిలా చూసుకోవాలనే తత్త్వం. అందుకే రూల్స్‌కు విరుద్ధంగా ఏది జరిగిన చిటపటలాడుతుంటాడు. చిన్న పాటి ఆర్కిటెక్ట్ ఇంజినీర్ ఉద్యోగంతో కుటుంబాన్నిసాకుతాడు. అలాంటి గోవర్ధన్ జీవితంలోకి అనుకోకుండా ఇందు (మృణాల్ ఠాకూర్) వచ్చి డిస్టబ్ చేయడమేకాక తన కుటుంబసభ్యులను మార్చేస్తుంది. అలాంటి టైంలోనూ ఆమెను తనకుటుంబ సభ్యురాలిగా చేసుకోవాలని చూసిన గోవర్ధన్‌కు ఓ చేదునిజం తెలుస్తుంది. అది ఏమిటి? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
ఈ చిత్ర కథ చూస్తే పాత సినిమాలలో నుంచి తీసుకున్న కథలా అనిపిస్తుంది. మధ్యతరగతి కుర్రాడు. తండ్రిలేని లోటు చూసుకోవాలి. ఒక అన్న తాగుబోతు. మరొకరు ఉద్యోగంలో డెవలప్ కోసం తమ్ముడు డబ్బులు సంపాదించడం.. ఇంటి పెద్ద దిక్కుగా బామ్మ వుంటుంది. ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాంటి ఫార్మెట్‌ను ఇప్పటి జనరేషన్‌కు తనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేయాలని దర్శకుడు పరశురామ్ చేసిన ప్రయత్నమే ఇది. ఈ చిత్ర కథంతా హీరో భుజస్కందాలపై నడుస్తుంది.
 
తెలీని అమ్మాయి తన ఇంటికి రావడం, ఆ తర్వాత అందరినీ కలుపుకోవడం, హీరోను ఎట్రాక్ట్ చేయడం.. తను ఆమె ప్రేమలో పడిపోవడం ఈ సన్నివేశాలన్నీ చాలా సరదాగా వుంటూ ప్రేక్షకులను అలరిస్తాయి. మరి అంతా సాఫీగా సాగితే ఎలా? అందుకే ఇంటర్‌వెల్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకు కీలకం. మధ్యతరగతి కుర్రాడంటే కొందరికి ఎందుకంత చిన్నచూపు అనే కోణంలో హీరో ఆలోచన వుంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో తనను తాను డెవలప్ అయ్యే క్రమంలో ఆ యువతి దగ్గరే కలిసి పనిచేయాల్సిరావడం అనేది సినిమాలో కీలకం. ఈ కోణంలో పాత సినిమా ఛాయలున్నా నేపథ్యం అమెరికా తీసుకుని కాస్త రిలీఫ్‌గా చూపించాడు. 
 
ఇందులో అందరూ బాగానే నటించారు. హీరో పలు షేడ్స్ చూపిస్తాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పిస్తుంది. ఇద్దరి నడుమ కెమిస్ట్రీ కొన్ని సీన్స్ లో బాగుంది. అలాగే జగపతిబాబు, వెన్నెల కిషోర్,  సీనియర్ నటి రోహిణి హట్టంగడి, ప్రభాస్ శీను తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
 
ఇలాంటి ఫ్యామిలీ సినిమాను చూపించాలంటే కొంత నెరేషన్ స్లోగా సాగుతుంది. అలానే ఈ సినిమా వుంది. హీరో క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా ఒకే లెవల్‌లో దర్శకుడు రాసుకున్నాడు. ప్రతి కుటుంబంలో ఒక్కడు పుడతాడు. వాడే కుటుంబాన్ని పైకి తీసుకువస్తాడు. తను పెద్దగా ఏమీ ఆశించడు అనే కాన్సెప్ట్ ఈ చిత్రం. దాన్ని తనదైన శైలిలో దర్శకుడు చూపించాడు. కుటుంబం బాగు కోసం ఏదైనా చేసే క్రమంలో తననుతాను అమెరికాలో అమ్ముకునే సీన్ కాస్త ఎంటర్‌టైన్ చేయిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య అలకలు, మనస్పర్థలు చాలా ఆసక్తిగా వుంటాయి.
 
అయితే, గీతగోవిందం తరహాలో ముగింపు హీరో రియలైజ్ అవ్వడం, ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వెళ్లి కాళ్ళు పట్టుకునేంతగా సీన్ క్రియేట్ చేయడంతోపాటు ఓ యాక్షన్ ఎపిసోడ్ చూపించి ముగించేశాడు. ఆ ముగింపు కూడా కాస్త రియలిస్టిక్ గానూ కృతకంగానూ అనిపిస్తుంది. 
 
దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో అవసరానికి తగ్గట్టుగా దిల్ రాజు పెట్టారు. ప్రతివారి ఇంటిలో నాన్న, అమ్మ ఫ్యామిలీ స్టార్ అనే చెప్పే క్రమంలో తాను సినిమా ప్రమోషన్ ను మాగ్జిమమ్ భుజాలపై మోసేశాడు. గోపి సుందర్ మ్యూజిక్ పర్వాలేదు. సిద్ శ్రీరామ్ పాటలు బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినా కుటుంబకథా చిత్రమంటే ఇలా వుంటుందపించేలా వుంది.
 
ఈ సినిమా కథను దర్శకుడు, నిర్మాత, హీరో కూడా ఓన్ చేసుకుని తీశారు. అలానే అందరూ కనెక్ట్ అవుతారని భావించారు. అలా భావిస్తే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అని చెప్పాలి. లేదంటే.. పాత చింతకాయపచ్చడిలో కొత్త నూనె వేసి తీసినట్లుగా వుందనుకుంటే చేసేదేమీ లేదు. ఏది ఏమైనా చక్కటి కుటుంబకథా చిత్రంగా కుటుంబంతో కూర్చుని చూసే సినిమాగా నూరు శాతం మార్కులు వేయవచ్చు. అమెరికా వెళ్లిన పూజ ;పునస్కారాలు చేయడం వంటి పద్ధతులు బాగున్నాయి.
 
రేటింగ్: 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు