భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇపుడు బయోపిక్ కాలం నడుస్తోంది. పలువురు జీవితగాథలతో బాలీవుడ్‌లో వచ్చిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇదేకోవలో టాలీవుడ్‌లో సీనియర్ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.
తొలితరం కథానాయికల తర్వాత తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన ధృవతార సావిత్రి. ఆమె కన్నా ముందు చిత్ర పరిశ్రమలో చాలామంది కథానాయికలు ఉన్నారు. ఆ తర్వాత చాలామంది వచ్చారు. కానీ, సావిత్రి మాత్రమే 'మహానటి' అయ్యారు. అంతటి గొప్ప నటీమణి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం 'మహానటి'. అలాంటి మహానటి జీవిత కథను నాగ్ అశ్విన్ ఏ విధంగా తెరకెక్కిస్తాడన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.
ముఖ్యంగా, నటీనటుల ఎంపిక దగ్గరి నుంచి ప్రచార చిత్రాల వరకూ ప్రతిదీవిభిన్నంగా తీర్చిదిద్దారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. మరి బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? సావిత్రిగా టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ ఏ మేరకు ఆకట్టుకుంది? అతిరథ మహారథులు పోషించిన అతిథి పాత్రలు ఎలా ఉన్నాయి? అందుకే ఓ సారి కథను విశ్లేషిస్తే...
కథ:
బెంగళూరు చాళుక్య హోటల్‌లో సావిత్రి(కీర్తి సురేశ్) కోమాలో ఉంటుంది. ఆవిడ సాధారణ మహిళ అనుకొని అందరు పేషెంట్లలాగే చూస్తారు. అయితే, ఆమె 'మహానటి' సావిత్రి అని తర్వాత తెలుస్తుంది. అభిమానులు ఆస్పత్రికి పోటెత్తుతారు. అప్పటి నుంచి ఏడాది పాటు ఆమె కోమాలోనే ఉండిపోతుంది. అయితే, ఆమె కోమా స్టేజ్‌లోకి హాస్పిటల్‌లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. కోమాలోకి వెళ్లడానికి ముందు సావిత్రి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఏంటి? బెంగళూరులో శంకరయ్యను కలవడానికని వెళ్లిన సావిత్రికి ఏం జరిగింది? అసలు శంకరయ్య ఎవరు? అనే విషయాలపై ప్రజావాణి పత్రిక న్యూస్ కవర్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగా మధురవాణి(సమంత), ఫొటోగ్రాఫర్ విజయ్ ఆంటోని(విజయ్ దేవరకొండ)లు కలిసి ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ ప్రారంభిస్తారు. కథ అలా మొదలైపోతుంది.
ఈ క్రమంలో సావిత్రి బాల్య దశ నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదగడం వంటివి చూపిస్తారు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న తమిళ సీనియర్ హీరో జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకోవడం.. హీరోయిన్‌గా తిరుగులేని వైభవాన్ని చూడటం. అంతలోనే భర్తతో విభేదాలు వచ్చి వారిద్దరూ విడిపోవడం, దీంతో సావిత్రి తాగుడుకి బానిస కావడం. చివరకు కోమా దశలో ప్రాణాలు విడిచిపెట్టడం. ఇలా మహానటి సావిత్రి జీవితంలో వివిధ కోణాలను యూనిట్ అందంగా ఆవిష్కరించారు దర్శకుడు నాగ్ అశ్విన్.
విశ్లేషణ:
నటీనటులపరంగా చూస్తే.. టైటిల్ పాత్రలో నటించిన కీర్తిసురేశ్ అచ్చం సావిత్రిలాగానే అచ్చుగుద్దినట్టు ఒదిగిపోయింది. సావిత్రి మరోసారి పుట్టిందేమో అనేంత గొప్పగా నటించింది. ఇక సావిత్రి సినిమా, నిజ జీవితం సమాంతరంగా నడిచాయి. స్టార్ హీరోయిన్‌గా, భార్య, తల్లిగా ఇలా వివిధ దశల్లో ఆమె జీవించిన క్రమంలో మార్పులను, హావభావాలను కీర్తి సురేశ్ చక్కగా పలికించింది. జెమినీ గణేశన్‌లా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు.
అదేసమయంలో సావిత్రి విషయంలో జెమినీ గణేశన్ ప్రేమ ఎలా ఉండేది. ఆమె ఉన్నతిలో ఆయనకు ఎలాంటి ఈర్ష్య ద్వేషాలుండేది అనే విషయాలను చక్కగా చూపించారు. స్టార్ హీరోయిన్ సమంత పాత్రపరిమితం. అయితే కథను డ్రైవ్ చేసే ఫోర్స్ ఆమె దగ్గర నుండే ప్రారంభమవుతుంది. పాత్ర చిన్నదే అయినప్పటికీ విజయ్ దేవరకొండతో కలిసి ఆమె తన పాత్రకు న్యాయం చేసింది.
ఇక సావిత్రి పెద్ద నాన్న కె.వి.చౌదరి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, ప్రజావాణి పత్రిక ఎడిటర్ పాత్రలో తనికెళ్ల భరణి, సావిత్రి తల్లి సుభద్రమ్మ పాత్రలో భానుప్రియ, సావిత్రి మేనత్త దుర్గాంబగా దివ్యవాణి, జెమినీ గణేశన్ మొదటి భార్య అలమేలు పాత్రలో మాళవికా నాయర్, సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్రలో షాలిని పాండే తదితరులు వారివారి పాత్రలకు న్యాయం చేశారు.
ఈ చిత్రంలో ఎస్.వి.రంగారావుగా నటించిన మోహన్‌బాబు, అక్కినేని పాత్రలో నాగచైతన్యలు అతికినట్టు సరిపోయారు. ఇక అలూరి చక్రపాణిగా ప్రకాశ్‌రాజ్, ఎల్.వి.ప్రసాద్ పాత్రలో శ్రీనివాస్ అవసరాల, ఆదూర్తి సుబ్బారావుగా సందీప్ వంగా, సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్, కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ జాగర్లమూడి అందరూ అతిథి పాత్రల్లో నటించి అలరించారు. అయితే క్రిష్ చేసిన కె.వి. రెడ్డి పాత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుటుంది.
టెక్నికల్ పరంగా...
సాంకేతిక నిపుణులపరంగా చూస్తే.. ఈ విభాగంలో మందుగా దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంక, స్వప్నదత్‌లను అభినందించాలి. ఓ నిర్ణీత సమయంలో మహానటి జీవితగాథను తెరకెక్కించడం నిజంగా అభినందించదగ్గ విషయం. కానీ.. వీరి పట్టుదల వల్లే మహానటి సినిమాగా రూపొందింది. విషయాన్ని సేకరించి దాన్ని నాగ్ అశ్విన్ అందమైన సినిమాగా తీర్చిదిద్దాడు. సావిత్రి గురించి అందరికీ తెలిసిన విషయాలే అయినా ఎక్కడా ఫ్లో మిస్ కాకుండా చక్కటి సినిమా రూపంలోకి తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మిక్కీ జె.మేయర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది.
మహానటి ఓ పీరియాడికల్ సినిమా. అందులో వివిధ కోణాలు ఆవిష్కరించారు. ఒక పక్క సినిమాలు, మరో పక్క జీవిత చరిత్ర. ఇన్ని కోణాలను టచ్ చేసే క్రమంలో సంగీతం సినిమాకు ఎసెట్ అయ్యింది. ఇక సినిమాటోగ్రాఫర్ డానీ ప్రతీ సీన్‌ను అద్భుతంగా చూపించాడు. సంగీతం, ఆర్ట్ వర్క్, కెమెరావర్క్ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. అవే సినిమాను ఓ హృదయ కావ్యంలా తెరపై ఆవిష్కరింపచేశాయి. సినిమా చూసినంత సేపు ఓ ఉద్వేగానికి గురైన ప్రేక్షకుడికి ఆ తర్వాత కూడా ఆ సినిమా గుర్తుకు వస్తుందంటే అంతకంటే గొప్ప సినిమా ఏముంటుంది.
ఈ చిత్రానికి గల బలాలను పరిశీలిస్తే, కథ, కథనం, కీర్తి, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు అద్భుతంగా ఉన్నాయి. అలాగే, ద్వితీయార్ధంలో కొంచెం వేగం తగ్గడం బలహీనతగా చెప్పుకోవచ్చు.