తెలుగమ్మాయి శ్రీదివ్య 'పెన్సిల్' ఎలా ఉందంటే... రివ్యూ రిపోర్ట్
శనివారం, 14 మే 2016 (13:10 IST)
పెన్సిల్ చిత్రం నటీనటులు : జీవి ప్రకాష్ కుమార్, శ్రీ దివ్య తదితరులు; సంగీతం : జీవి ప్రకాష్ కుమార్, నిర్మాత : ఎస్.పి.రాఘవేష్, దర్శకత్వం : మణీ నాగరాజ్
హీరోలుగా వారసులుగా వస్తున్న తరుణంలో టెక్నీషియన్లు హీరోలుగా మారుతున్నారు. దక్షిణాది సంగీత దర్శకుడిగా గుర్తింపున్న జీవి ప్రకాష్, ఈమధ్యే హీరోగానూ మారి వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా 'పెన్సిల్'ను అదే పేరుతో తెలుగులో అనువదించారు. శ్రీదివ్య హీరోయిన్‌గా నటించింది. రెండేళ్ళనాడు ఆరంభించిన ఈ సినిమా ఫైనాన్స్ ఆటుపోట్లను ఎదుర్కొని ఎట్టకేలకు శుక్రవారమే విడుదలైంది. తెలుగులో ఈ వారం స్ట్రెయిట్ చిత్రాలు లేకుండా పోయాయి. ఓన్లీ డబ్బింగ్ చిత్రాలు మాత్రమే వచ్చాయి. అందులో ఒకటి పెన్సిల్. మరి చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ : అది కార్పొరేట్ స్కూల్. శివ (జీవీ ప్రకాష్) ట్వల్త్ స్టాండర్డ్ చదువుతుంటాడు. చదువుల్లో మేటి. తన క్లాస్‌మేట్ మాయ(శ్రీ దివ్య)ను ప్రేమిస్తాడు. అక్కడే స్టార్ హీరో కుమారుడు నితిన్ (షారిఖ్ హాసన్) కూడా చదువుతుంటాడు. తోటి అమ్మాయిలతో అతని బిహేవియర్ ఇబ్బందికరంగా వుంటుంది. అలాంటి నితిన్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో హత్య కాబడతాడు. అనుకోని స్థితిలో శివ, మాయ ఆ ప్రాంతంలో ఇరుక్కుపోతారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత, మర్డర్ ఎవరు చేశారన్నది తామే కనిపెట్టాలని శివ, మాయ ఏయే ప్రయత్నాలు చేశారు? అనేది మిగతా సినిమా.
పెర్‌ఫార్మెన్స్:
టీనేజ్ కుర్రాడిగా జీవి ప్రకాష్ అమరాడు. నటనలో తన ప్రతిభ బాగుంది. తెలుగమ్మాయి శ్రీదివ్య ప్రత్యేక ఆకర్షణ. చాలా ఈజ్‌తో నటించేసింది. ఇది ఆమె గత చిత్రాలకు భిన్నమైనది. షారిఖ్ హసన్ నటన కూడా చాలా బాగుంది. చాలాచోట్ల రఘువరన్ సినిమాలో విలన్ తరహా చాయలు కనిపిస్తాయి. ఇక మిగిలిన పాత్రలన్నీ కథలో అలా వచ్చి వెళ్ళిపోయేవే.
సాంకేతిక విభాగం :
మర్డర్ మిస్టరీ చుట్టూ, ఒకే ప్రదేశంలో జరిగే కథకు కావాల్సిన మూడ్ సినిమాటోగ్రాఫర్ బాగా పట్టుకున్నారు. ఆర్ట్ డైరెక్షన్ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. జీవీ ప్రకాష్ అందించిన పాటలేవీ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. మణిరాజ్ కొత్త దర్శకుడిగా టేకింగ్‌లో విజయం సాధించాడు. ముఖ్యంగా ఓ చిన్న పాయింట్ చుట్టూ తెలివిగా స్క్రీన్‌ప్లే రాసుకొని రచయితగా మణి మంచి ప్రతిభ చూపాడు. మేకింగ్ పరంగా మణి అక్కడక్కడా చిన్న చిన్న ప్రయోగాలు చేశాడు.
విశ్లేషణ:
కార్పొరేట్ కల్చర్ వున్న స్కూల్స్, కాలేజీలో ఎడ్యుకేషన్ విధానం ఎలా వుంటుంది. అనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈ పాయింట్ నచ్చే తెలుగులో హరి అనే డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేశాడు. ఓ చిన్న పాయింట్‌ను తీసుకొని దానిచుట్టూ ఓ మర్డర్ మిస్టరీని తెలివిగా అల్లిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఈ మర్డర్ మిస్టరీని చేజ్ చేసే క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు కూడా కట్టిపడేసేలా ఉన్నాయి. సినిమా పరంగా సెకండాఫ్‌ను చెప్పుకోవాలి.
సెకండాఫ్ చివర్లో ట్విస్ట్ రివీల్ అయ్యే సన్నివేశాలు, క్లైమాక్స్, ఓ సామాజిక అంశం.. ఇవన్నీ బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఎక్కడా లాజిక్కుల గురించి వెతక్కూడదు. ఒక స్కూల్లో ఇంత పెద్ద విషయం జరిగితే, అది ఎవ్వరికీ తెలియనట్లుగా చిత్రించడం పెద్దగా ఆకట్టుకోదు. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల లాజిక్ అన్న అంశానికి చోటే లేకుండా పోయింది. రొటీన్‌గా తెలుగు సినిమాల్లో పాటల్లాగే మధ్యమధ్యలో కథకు అడ్డంకిగా పాటలు కూర్చేశారు.
తమిళ కథలంటే ఏదో కొత్తదనం వుంటుందని ప్రేక్షకుడు భావిస్తాడు. స్క్రీన్‌ప్లే ఆ కథల్లో బాగుంటుంది. అవి ఎటువంటి ప్రేక్షకుడినైనా ఆకట్టుకునే అంశాలతో తీసినప్పుడు ఇంకా బాగుంటాయి. 'పెన్సిల్'.. ఇలా ఓ సింగిల్ పాయింట్‌నే నమ్ముకొని వచ్చిన మర్డర్ మిస్టరీ. థ్రిల్లర్ సినిమాలను బాగా ఇష్టపడేవారు, ఇప్పటికే సమ్మర్ సినిమాలన్నీ చూసేసి కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ టైమ్‌పాస్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది.