కిశోర్‌రాఠి చిత్రాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌తోపాటు సెంటిమెంట్ చిత్రాలు పలు వచ్చాయి. రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, మాయలోడు వంటి చిత్రాలు ఆ బేనర్‌లోనివే. కొంతకాలం గ్యాప్ తీసుకుని మరలా అలీ ప్రధాన పాత్రతో 'రంగుపడ్డుద్ది' పేరుతో చిత్రాన్ని నిర్మించారు. మౌనమేలనోయి దర్శకుడు శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారమే విడుదలైంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లోనూ విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ: అలీ, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముగ్గురు భిన్నమైన ఆలోచనలు గల వ్యక్తులు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని తక్కువకు అమ్మేసి కొన్నవారు కోటీశ్వరులైతే బాధపడుతూ ఏదైనా చేయాలనుకునే వ్యక్తి అలీ. ఎప్పుడూ నిధుల కోసం కలలుకనే వ్యక్తి శేషు. 50 దాటినా ఇంకా యూత్‌గా భావించే అప్పారావు. వీరంతా బ్లాక్‌హోల్ సాయంతో టైమ్‌మిషన్‌లో ప్రయాణించి తమ కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటారు.
మరోవైపు తిండిబోతు సుమన్‌శెట్టి, హీరోయిన్ అవ్వాలనే హీన, గుర్రపు పందాలతో కోట్లు సంపాదించాలనే ధనరాజ్.. వీరిదే అదేరూటు. ఈ ఆరుగురి స్టడీచేసిన శాస్త్రవేత్త రఘుబాబు. మీ కోరికలు నెరవేరాలంటే ఓ చోటకు రమ్మని ఆహ్వానిస్తాడు. వారంతా రెండు గ్రూపులుగా ఓ భవంతికి వచ్చి అందులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
హార్రర్, థ్రిల్ కల్గించే చిత్రాల్లో ఎక్కువగా ప్రేక్షకుడిని కట్టిపడేసేది భయం. ఆ భయంతో రామ్‌గోపాల్‌వర్మ కొన్ని చిత్రాలు తీసి సొమ్ము చేసుకున్నాడు. ఓంకార్ కూడా రాజుగారి గది వంటి చిత్రాన్ని తీసి మెప్పించాడు. అలాంటి ప్రయత్నమే మహేస్‌రాఠి కథను రాసుకుని తీసిన చిత్రమిది. అయితే నేపథ్యం వేరుగా వుంటుంది. ఇందులో నటించిన నటీనటులు ఒకే చోట ఎవరికివారు తెలీయకుండా దెయ్యంలా భ్రమపడి భయపడే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. వారిలోని నటనను బయట పెట్టాయి. అలీ చేసే విన్యాసాలతోపాటు హీన చేసే గ్లామర్ ఎట్రాక్ట్‌గా నిలుస్తుంది. ఇటువంటి కథను మరింతగా ఎట్రాక్ట్‌గా చేయాలంటే దర్శకుడు పనితనం చాలా అవసరం. దానికి కెమెరామెన్ నైపుణ్యం మరింత కావాలి. రెండు భాగాలు తమ వంతు కృషి చేశాయి.
మొదటి భాగం చాలా త్వరగా అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆరుగురు వ్యక్తుల్ని ఒకే భవంతిలోకి తేవడంతో ఇంటర్‌వెల్ పడుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందనేది రెండోభాగంలో వుంటుంది. దాన్ని ఆకట్టుకునేలా చేయగలిగాడు దర్శకుడు. సాంకేతికపరంగా రీరికార్డింగ్ ఓకే. సన్నివేశపరంగా రెండుచోట్ల గ్రాఫిక్స్ పెట్టారు. అవి పెట్టాల్సిన అవసరంలేకుండా కథ సాఫీగా సాగుతుంది. అదేవిధంగా అప్పారావు, హీనపై పాట గతంలో బాబూమోహన్‌పై చిత్రీకరించిన పాటలా అనిపిస్తుంది. ఏది ఏమైనా తిమ్మిని బమ్మిని చేసి ప్రేక్షకుడ్ని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు. దానివల్ల కొన్ని చోట్ల లాజిక్కులు పట్టించుకోలేదు. ఫైనల్‌గా దీనికి సీక్వెల్ వుంటుందని ముగింపు ట్విస్ట్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా సాగింది. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని భాగాలు తీయాలనుందని నిర్మాత పేర్కొనడం విశేషం. ఇప్పటికే రంగుపడుద్ది-2 కూడా రెడీ అయిందని చెప్పేశారు.