కోలార్ మైన్స్ మూలాలను చెప్పిన తంగలాన్ చిత్రం రివ్యూ రిపోర్ట్

డీవీ

శుక్రవారం, 16 ఆగస్టు 2024 (10:25 IST)
Tangalan
నటీనటులు: విక్రమ్, పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కల్టగిరోన్‌ తదితరులు.
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్ కుమార్, సంగీత దర్శకుడు: జి. వి. ప్రకాష్, ఎడిట‌ర్ : సెల్వ ఆర్ కే, నిర్మాత : కేఈ జ్ఞానవేల్ రాజా,  దర్శకుడు: పా. రంజిత్
 
చియాన్ విక్రమ్ దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా తంగలాన్. ఆటవిక నేపథ్యంలో బంగారు గనుల కోసం వెతికే కథగా ముందుగా చిత్ర టీమ్ చెప్పేసింది. అయితే ఇప్పటికే కె.జి.ఎఫ్. వంటి పలు సినిమాలు కోలార్ మైన్స్ గురించి వచ్చేశాయి. మరి తంగలాన్ ఏమి చెబుతుంది? అన్న ప్రశ్నకు విక్రమ్ సూటిగానే సమాధానం చెబుతూ, కోలార్ మైనింగ్ పుట్టుక, పూర్వాపరాలు అంటూ వివరించారు.  చరిత్రలో జరిగిన కథను చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పారు. మరి ఈ సినిమా ప్రేక్షకుడికి కూడా అలా అనిపిస్తుందా? లేదా? అంటే కథలోకి వెల్ళాల్సిందే. 
 
కథ :
 ఇది 1850 నాటి కథ. అప్పట్లో దేశంలో రాజులు పాలిస్తుంటే, బ్రిటీష్ వారు తమకు అనుకూలమైన ప్రాంతాలను ఏరికోరి ఎంచుకుని ప్రక్రటి వనరులను కైవసరం చేసుకునేవారు. అలా ఛాణుక్యులు, టిప్పు సుల్తాన్ పాలనలో బంగారు గనులున్నట్లు భావించి ఓ పర్వత ప్రాంతంలో ఆటవిక జాతులచేత బానిసలుగా పనిచేయించుకని బంగారాన్ని సంపాదించేవారు. ఆ వంశీయులకు చెందిన వాడే తంగలాన్.  భార్య గంగమ్మ (పార్వతీ తిరువోతు)తో పాటు ముగ్గురు ఆడ పిల్లలు, ఒక మగపిల్లాడుతోపాటు తమ జాతిగెలతో పూర్వీకులనుంచి వారసత్వంగా వచ్చిన పొలాల్ని సాగుచేసుకుంటూవుంటాడు. 
 
వీరి పంటలపై ఊరిలోని రాజుపై కన్నుపడుతుంది. పంటనంతా లాగేయాలని కుట్ర పన్ని బానిసలుగా వారిపొలాల్లో పనిచేయించుకుంటాడు. ఆ క్రమంలో పక్కనే వున్న కాలువలో మట్టిని జల్లెడపట్టడంతో బంగారం కనిపిస్తుంది. ఇది తెలిసి ఆ రాజు మొత్తం తనకేకావాలంటూ వారిచేత ఊడిగం చేయిస్తుంటాడు. అలాంటి టైంలో బ్రిటీష్ దొరలు వచ్చి తంగలాల్ జాతినంతటినీ బంగారం వెతికే పనిలోకి తీసుకెళతాడు. అళా వెళ్ళేక్రమంలో జరిగే చిత్రమైన సంఘటనలు, బంగారపు కొండను కాపలావుండే నాగజాతి వంశీయులు ఆరతి (మాళవిక మోహనన్) వీరిని ఏవిధంగా ఎదుర్కొన్నారు? చివరికి అసలు తంగలాన్ అనేవాడు ఎవడు? అనేది సస్పెన్స్. అది తెరపై చూడాల్సిందే.  
 
సమీక్ష:
కథావస్తువు బ్రిటీష్ కాలంనాటిది కాబట్టి అప్పటి చరిత్ర తెలుసుకోవడం కోసం చాలా ఆసక్తికరమైన సన్నివేశాలున్నాయి. ఆటవిక జాతులు ఏవిధంగా బతుకు వెళ్ళతీశారో చక్కగా చూపించాడు.  ఈ కథకు తంగలాన్ ప్రధాన బలం. విక్రమ్ పలు షేడ్స్ లో కనిపిస్తాడు. పాత్రలో లీనమై చేశాడు. మట్టిలో బురదలో ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ తీవ్రమైన భావోద్వేగాలతో పాటు అద్భుత పోరాటాల్లోనూ విక్రమ్ తన మార్క్ నటనతో హైలెట్ గా నిలిచారు. కీలక పాత్ర అయిన ఆరతి పాత్రలో నటించిన మాళవిక మోహనన్ చాలా చక్కగా నటించింది. ఆమెకు విక్రమ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయి.
 
సీనియర్ నటీనటులు మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, . అలాగే పశుపతి, డేనియల్ కల్టగిరోన్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బ్రిలీష్ పాత్రలు చేసిన నటులు జీవించారు.  ముఖ్యంగా ఈ చిత్రం మొదటి భాగం బాగానే ఉంది. దర్శకుడు పా. రంజిత్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయి. కథా నేపథ్యం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది.
 
ముందుగానే ఇది పూర్వచరిత్ర అని చెప్పేయడంతో సినిమాటిక్ కమర్షియల్ ఎలిమెంట్లు కనిపించవు. కాకపోతే బంగారు వెతికే క్రమంలో వాదోపవాదాలతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్, కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ..స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగింది.
 
సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది. తంగలాన్ ను ఆరతి పాత్ర ఎటాక్ చేసినా ఎందుకు చావడంలేదు? అనేది ఆసక్తికరంగా చూపించాడు. చాలా సన్నివేశాల్లో ఉత్కంఠను ప్రేక్షకుల్లో దర్శకుడు కలిగించాడు. మొత్తానికి దర్శకుడు పా. రంజిత్ టేకింగ్ పరంగా తాను అనుకున్నట్లు చూపించాడు. 
 
ఒకప్పటి మెకనాస్ గోల్డ్ రకరకాల ట్విస్టులతో చూపించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి. ఆమధ్య కె.జి.ఎఫ్. వచ్చింది. అయితే వీటన్నటికీ మూలాలు తెలియజేప్పే కథే తంగలాన్. నాగవంశీయురాలు చనిపోతే ఆమెనుంచి వచ్చిన రక్తం ఎక్కడ బడితే అక్కడ బంగారం అయిపోతుంది. ఇలా కొన్ని చిత్రమైన విషయాలు చూపించాడు. 
 
ఇందులో చాలా ఆసక్తికరమైన అంశాన్ని గమనించేలా చేశాడు. రాజులు, బ్రిటీష్ లు కూడా బ్లడీ ఇండియన్స్ ను బానిసలుగా చేసినా బ్రిటీషర్లు బానిసలను ముట్టుకునేవారు. వారికి వస్త్రధారణ చూపించడమే కాక వారి వస్త్రాలు వీరికి ఇవ్వడం జరుగుతుంది. కానీ రాజులు, వారి కింద పనిచేసే ఉద్యోగులు ఆటవికలను పురుగుల్లా చూడడం, నీచంగా మాట్లాడడం.. వంటివి ఎన్ని యుగాలు మారినా ఇంకా వారి వారసులు ఇప్పటికీ కొనసాగుతుండటం నిజంగా దౌర్భగ్యం అనే చెప్పాలి. 
 
సాంకేతికంగా చెప్పాలంటే.. సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
 
తంగలాన్’ అనేది పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. కథ కోలార్ మైన్ పరిసర ప్రాంతాల్లో కాబట్టి అక్కడక్కడా రాజులు కన్నడ మాట్లాడడం చూపించాడు. చివర్లో తంగలాన్ యుగం నుంచి తరాలు మారుతూ బ్రిటీషర్లు, చైనా, జపాన్ వంటి కోలార్ మైన్ ను ఏవిధంగా దోచుకున్నది అప్పటి కార్మికులు తాటాకుల నుంచి గుడారాలు, కాలనీలుగా మారిన వైనాన్ని చూపిస్తూ ముగింపు ఇవ్వడం బాగుంది. అలా కాలం మారి ప్రస్తుతం కాలంలో కె. జి.ఎఫ్.గా వచ్చిందని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇది తెలుసుకోవాల్సిన కథ.
రేటింగ్ : 3/ 5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు