మూడు ప్రధాన పాత్రలు, మూడే లొకేషన్లు, మూడే పాటలతో "రాత్రి" సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు భానుకిరణ్ అన్నారు. షియాజీ షిండే, ప్రతి మెహరా, సమీర్ నటిస్తోన్న ఈ చిత్రం గురించి దర్శకుడు భానుకిరణ్ మాట్లాడుతూ.. థ్రిల్లర్, హారర్ మూవీ ఇది కాదని, ప్రేమకు పునాది నమ్మకమని, ఆ నమ్మకమే లేకపోతే ప్రేమ ఏమవుతుంది? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.
పగలు నిజాలుగా కన్పించినవి రాత్రికి అసత్యాలవుతాయని, అదే రాత్రికున్న పవర్ అని భానుకిరణ్ వెల్లడించారు. ఇదే నేపథ్యంలో రూపొందే చిత్రం కాబట్టి "రాత్రి" అనే టైటిల్ పెట్టామన్నారు.
చిత్ర నిర్మాత ఆర్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ... చక్కని పాయింట్‌తో ఆసక్తికరమైన కథాగమనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. ఈ చిత్రంలోని తన పాత్ర బాగా నచ్చిందని, ఒక గేమ్‌లాగా ఎత్తులు పై ఎత్తులుగా ఉంటుందని షిండే చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి కెమెరా.. ఎస్.డి.జాన్, ఆర్ట్. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత... నాగరాజ్ ఆర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం... భాను కిరణ్