రోజులానే ఆ ఆదివారం మొద్దు నిద్దుర నుంచి లేచాను. ఆదివారం కదా... నన్నెవరూ కదిలించకండి అని మళ్లీ ముసుగుతన్నాను. పావుగంట గడిచిందో లేదో... పెద్ద రాయి నీళ్లలో పడినట్లు చప్పుడు. ఆ తర్వాత కుక్కపిల్ల ఆర్తనాదాలు. ముసుగుతీసి నిద్రకళ్లతో కుక్కపిల్ల మూలుగు వినబడుతున్న దిశకేసి నడిచాను.
చూద్దునుకదా... తాడిలోతు నీళ్లున్న బావిలో కుక్కపిల్ల గిలగిలమంటోంది. బోరింగుకోసం వేసిన బావి కావడంతో బావిని ఇనుపగొట్టాలు నింపేశాయి. దానినెలాగైనా తీద్దామని గోడకు కట్టిన ఫోనువైరును తెంపి ఓ డబ్బాకు కట్టి బావిలో దించాను. డబ్బా నీటిని తాకీతాకగ ముందే ఒక్క ఉదుటున ఎక్కి కూర్చుంది కుక్కపిల్ల. మెల్లగా బయటకు లాగి వదిలాను. గజగజా వణుకుతూ... నా కాళ్ల చుట్టూ తిరగసాగింది.
ఈ సంఘటనతో నా చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చాయి. మాది మహా పల్లెటూరు. వానొస్తే మనుషులు తప్ప అన్నీ తడిసి ముద్దవ్వాల్సిందే. అంతెందుకు అప్పట్లో మా ఊళ్లో కొన్ని ఇళ్లలోని మనుషులు కూడా తడిసి ముద్దయ్యేవారు. కారణం... వారి పూరిళ్లకు పైకప్పు ఉండేది కాదు మరి. అలాంటి పరిస్థితుల్లో ఓ రోజు కుంభవృష్టి.
అర్థరాత్రి కావొస్తోంది. మా ఇంటి వెనకాల ఓ కుక్క అదేపనిగా మొరగటం ప్రారంభించింది. పిడుగులు, మెరుపులతో పట్టపగల్లా వుంది ఆరుబయట. అటువంటి జోరు వానలో మా నాన్న కుక్క అరుస్తున్న వేపు వెళ్లాడు. ఓ పదిహేను నిమిషాల తర్వాత ఓ నాలుగైదు కుక్కపిల్లలతో మా ఇంటి పంచలోకి అడుగుపెట్టాడు. ఆయన వెనకే గోధుమ రంగులో ఉన్న కుక్క కూడా వచ్చింది.
పాపం కుక్కపిల్లలకోసం తీసిన గుంట వర్షపునీటితో నిండిపోయింది. పిల్లలన్నీ నీళ్లలో మునిగిపోయాయి. అందుకే కుక్క అరుస్తోంది. అంటూ ఎండుగడ్డి మోపులో వెచ్చగా పడుకోబెట్టాడు వాటిని. అంతే... బంధువులు,స్నేహితులు తప్ప మా ఇంటి వైపు రావాలంటే ప్రతి ఒక్కరూ జంకేవారు. దాదాపు పదిహేనేళ్లు మా ఇంటి కాపలా సేవను అవి నిర్వహించాయి.