బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు సెల్లార్ దర్శనాలు రద్దు!

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులతో తిరుమల కిటకిటలాడుతున్న సంగతి తెలిసిందే. స్వామివారి దర్శనార్థం అనూహ్యంగా పెరుగిపోతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు సిఫార్సు ఉత్తరాలపై మంజూరుచేసే సెల్లార్, విఐపీ దర్శనాలను పూర్తిగా రద్దుచేస్తున్నట్లు టీటీడీ ఈవో రమణాచారి స్పష్టం చేశారు.

గురువారం సర్వదర్శనం కోసం ఎదురుచూసే యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి రెండు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఈ సందర్భంగా తోపులాట కూడా జరిగింది. దీనితో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన టీటీడీ, సెల్లార్, విఐపీ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది.

సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే సమయం పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని విఐపీ భక్తులు వారికి అసౌకర్యం కలుగకుండా సహకరించాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు. బ్రేక్, సెల్లార్ దర్శనాలు పూర్తిగా రద్దుచేసి సామాన్య భక్తులకే ప్రాధాన్యతనిస్తామన్నారు.

టీటీడీ చరిత్రలో బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడం ఇదే మొదటి సారని రమణాచారి వెల్లడించారు. అందుకు తగిన విధంగా టీటీడీ స్పందించి భక్తులకు సేవలందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి