యాత్రికుల వసతిపై దృష్టిసారించని తితిదే

శ్రీవారి దర్శనార్థం తిరుమల కొండపైకి రోజుకు కనీసం 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ రద్దీ లక్ష వరకు ఉంటుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో కేవలం 20 వేల మందికి మాత్రమే వసతి సౌకర్యాలు వున్నాయి. ఏడాదికి ప్రత్యక్షంగా 1200 కోట్ల రూపాయలను, వడ్డీలు, ఇతరాత్రా రూపేణా మరో ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్న తితిదే భక్తుల వసతి సౌకర్యాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే కొండపై స్థలాల పందేరంలో మాత్రం ముందుంది. 1994 నిషేధాన్ని పక్కన పెట్టిన తితిదే.. ప్రస్తుతం ధనవంతులకు ఇష్టానుసారంగా వేలాది చదరపుటడుగుల స్థలాన్ని ధారాదత్తం చేస్తోంది. ఇందులోభాగంగా ఇప్పటికే యశోద ఆస్పత్రికి ఆరు వేలు, బిర్లా స్కూల్‌కు నాలుగు వేలు, పుదుచ్చేరి ప్రభుత్వానికి వెయ్యి చదరపుటడుగుల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా తితిదే ఆధ్వర్యంలోని అతిథి గృహాల అద్దెలు వేలల్లో ఉన్నాయి. దీంతో సామాన్య భక్తులకు ఇవి ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. అయితే బడాబాబులకు మాత్రం స్థలాలు, సూట్‌ల కేటాయింపులో తితిదే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి