వైభవంగా ముగిసిన ధ్వజారోహణం

బుధవారం, 1 అక్టోబరు 2008 (19:35 IST)
తిరుమల మలయప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ధ్వజారోహణం వైభవంగా ముగిసింది. భక్తుల గోవింద నామ స్మరణ, అర్చకుల వేద పండితోచ్చారణ నడుమ ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. సర్వలంకారభూషితుడైన పద్మావతీ సమేత వెంకన్నను దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను సకల దేవతామూర్తులను ఆహ్వానించే దిశగా ధ్వజస్తంభం మీద గరుడ పతాకాన్ని ఎగరవేసే కార్యక్రమాన్నే ధ్వజారోహణం అంటారని శాస్త్రోక్తం.

ధ్వజారోహణం పూర్తయిన తర్వాత స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై, పెద్దశేషవాహనంపై ఆసీనుడై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.

దీని ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పిస్తారని టీటీడీ వెల్లడించింది. ముందుగా పట్టు వస్త్రాలను తెచ్చిన ముఖ్యమంత్రికి పెద్ద జయ్యంగార్ మఠం వద్ద ఆలయ మర్యాదలతో శాస్త్రోక్తంగా స్వాగతం పలుకుతారు. అనంతరం ముఖ్యమంత్రి నేరుగా ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

వెబ్దునియా పై చదవండి