తిరుమల వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల మూడవరోజైన శుక్రవారం తిరుమలలో స్వామివారు సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. దశావతారాల్లో నాలుగోది నరసింహావతారం. ధర్మసంరక్షణార్థమై నరసింహ అవతారాన్ని ధరించిన స్వామి, బ్రహ్మోత్సవాల్లో సింహవాహనంపై ఊరేగడాన్ని భక్తులు విశిష్టంగా భావించడం ప్రతీతి.
అన్నమయ్య కూడా శ్రీవారి సింహవాహన సేవపై ఎన్నో కీర్తనలు గానం చేసిన సంగతి విదితమే. సింహవాహనంపై శ్రీవారు ఊరేగింపును తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారు.
ఇదిలా ఉండగా, గురువారం రాత్రి శ్రీవారు చిన్నశేష, హంసవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం మురళీకృష్ణుడిగా ఆలమందలతో చిన్నశేషవాహనంపై వెంకన్న సాక్షాత్కరించి మాడవీధుల్లో ఊరేగిన వైనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. అదేవిధంగా గురువారం రాత్రి మలయప్ప సర్వాలంకరణతో వీణాపాణియై హంసవాహనమెక్కి భక్తకోటికి దర్శనమిచ్చారు.